ఇదులగూడ జంక్షన్లో 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం
మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్: మిర్యాలగూడ పట్టణంలోని ఇదులగూడ జంక్షన్ వద్ద 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) బుధవారం శ్రీకారం చుట్టారు. కొబ్బరికాయ కొట్టి పనులను లాంఛనంగా ప్రారంభించారు. పట్టణ ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తొలగించడంతో పాటు, ప్రధాన రహదారిపై ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR మాట్లాడుతూ పట్టణంలో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదులగూడ జంక్షన్ వద్ద 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తయితే పట్టణం నుంచి ప్రధాన రహదారిపైకి వెళ్లే వాహనదారులకు, ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.