జాతీయ స్థాయి పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు
పోలాకి, సూర్య : మండలంలోని ఈదులవలస ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. అండర్-19 విభాగంలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న జె. కీర్తిని జూనియర్ నేషనల్ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 25వ తేదీన పంజాబ్‌లో జరగనున్న జూనియర్ నేషనల్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో కీర్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పైడి ప్రవీణ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించి కీర్తినిని ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు పాఠశాల ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఫెన్సింగ్ అండర్-19 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ప్రథమ సంవత్సరం ఎంఈసీ విద్యార్థిని బి. బలరాణి, ప్రథమ సంవత్సరం ఎంపీసీ విద్యార్థిని ఎస్. మాధవిలతలను కూడా ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం. నీలం, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొని విద్యార్థినులను అభినందించారు.