మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళి
శ్రీకాకుళం, సూర్య : దేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన స్వాతంత్య్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి అదనపు ఎస్పీ పి. శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశ విద్యారంగ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని, విద్యా సంస్కరణలకు విశేష కృషి చేయడంతో పాటు సమగ్ర విద్యా విధానాల రూపకల్పనకు పునాదులు వేశారని తెలిపారు. విద్యారంగానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా 1992లో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న'తో గౌరవించిందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, విద్యాభివృద్ధి పట్ల చూపిన దార్శనికత నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కె నర్సింగరావు,జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.