విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు
• విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావంతో లక్ష్యాలను సాధించాలి.
• యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణానికి రూ.600 కోట్ల వ్యయం.
• మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో.. కలెక్టర్ కుమార్ దీపక్
సూర్య, లక్షెట్టిపేట :
విద్యతోనే వ్యక్తి జీవితంలో సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధనతో తమ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. బుధవారం లక్షెట్టిపేటలోని ప్రధానమంత్రి మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల, బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాల వార్షిక క్రీడా దినోత్సవానికి ఆర్‌సీవో శ్రీధర్‌తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ వరకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు సైతం ఉన్నత స్థాయికి చేరుకోవడానికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. విద్య ద్వారా జ్ఞానం, ఆత్మవిశ్వాసంతో పాటు అనేక అవకాశాలు లభిస్తాయని, విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రభుత్వం విద్యారంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లాలో మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులు చేపట్టామని, ఒక్కో పాఠశాలకు సుమారు రూ.200 కోట్ల చొప్పున మొత్తం రూ.600 కోట్లు వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు. ఒక్కో పాఠశాలలో సుమారు 2,600 మంది విద్యార్థులకు వసతి కల్పించే అవకాశం ఉంటుందని, మూడు పాఠశాలల్లో మొత్తం 7,800 మంది విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ప్రస్తుతం తాత్కాలిక, అద్దె భవనాల్లో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలకు నూతన భవనాల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చి మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, సమన్వయం, జట్టుస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు అలవడతాయని అన్నారు. క్రీడా పోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ నిబద్ధతతో సాధన చేయాలని సూచించారు. మార్చ్‌ఫాస్ట్‌లో విద్యార్థులు సమన్వయంతో ఒకే విధంగా అడుగులు వేయడం క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యోగ ఎంపికలు, పోటీ పరీక్షలు, ప్రైవేటు రంగాల్లో అవకాశాలు పొందేందుకు క్రమశిక్షణ, చురుకుదనం, నేర్చుకోవాలనే ఆసక్తి ఎంతో అవసరమని తెలిపారు.
• తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీ
అనంతరం లక్షెట్టిపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి డిప్యూటీ తహసీల్దార్ శ్రావణితో కలిసి పలు రెవెన్యూ అంశాలను పరిశీలించారు. జీఓ నంబర్లు 76, 58, 59 కింద వచ్చిన దరఖాస్తులు, భూభారతి కార్యక్రమం, భూముల రీ-సర్వే, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. జీఓ 58, 59 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం ప్రయోజనాలు అందించాలని సూచించారు. భూభారతి కింద వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, రీ-సర్వే పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు త్వరగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.