స్టార్టప్‌లకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
WIPO సహకారంతో మేధో సంపత్తి హక్కులపై శిక్షణ
చేనేత, హస్తకళల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్.. సీఎం చంద్రబాబు
సూర్య స్టేట్ బ్యూరో అమరావతి :
రాష్ట్రంలో ఆవిష్కరణలు, పరిశోధన, సృజనాత్మకతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతలో నూతన ఆలోచనలను ప్రోత్సహిస్తూ, స్టార్టప్ సంస్థల అభివృద్ధికి సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో నోవోటెల్ హోటల్‌లో వరుస సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలకు మేధో సంపత్తి హక్కులపై అవగాహన కల్పించేందుకు WIPO సహకారం అందించాలని కోరారు. WIPO–ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఏర్పాటు, భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, డిజైన్లు, సాంకేతిక పరిజ్ఞాన పరిరక్షణపై శిక్షణ అందించే అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలోని చేనేత, హస్తకళలు, స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) సాధించడంతో పాటు ఇప్పటికే గుర్తింపు పొందిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత ఆదరణ కల్పించేలా సహకరించాలని కోరారు. నాణ్యత, బ్రాండింగ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే అంశాలపైనా చర్చించారు.