telangana
మోతె లైబ్రరీ మోడల్‌గా నిలుస్తుంది - త్వరలో సందర్శిస్తా - నవీన్ నికోలస్ ఐఏఎస్
సూర్య వేల్పూరు : వేల్పూరు మండలం మోతె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధునిక గ్రంథాలయంపై తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ IAS ప్రశంసలు కురిపించారు. లైబ్రరీ ప్రారంభోత్సవానికి అత్యవసర పరిస్థితుల కారణంగా హాజరు కాలేకపోయిన ఆయనను, గ్రంథాలయ దాత అల్లపుల్ల గంగారెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మోతె పాఠశాలలో నిర్వహిస్తున్న రీడింగ్ సెషన్ల వీడియోలను కమిషనర్ వీక్షించారు. తన స్వగ్రామమైన మోతె గ్రామంలోని తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో, తన తండ్రి అల్లపుల్ల రాజులు జ్ఞాపకార్థం సుమారు రూ.11 లక్షల వ్యయంతో ఆధునిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన గంగారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. వ్యయప్రయాసలకు ఓర్చి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.మోతె లైబ్రరీ ఒక మోడల్‌గా, ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇలాంటి నాణ్యమైన ఆధునిక గ్రంథాలయాలు ఎంతో అవసరమని తెలిపారు. పుస్తక పఠనం ద్వారా పిల్లలకు ప్రపంచ జ్ఞానం పెరగడంతో పాటు ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుందని, కథలు, నవలలు చదవడం వల్ల తెలుగు, ఆంగ్ల భాషలపై మంచి పట్టు సాధించవచ్చని వివరించారు. ఇలాంటి గ్రంథాలయాల ఏర్పాటును స్వాగతిస్తున్నానని, త్వరలోనే మోతె లైబ్రరీని సందర్శిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మోతె పాఠశాలలో నెలకొన్న కొన్ని సమస్యలను గంగారెడ్డి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టిన గంగారెడ్డిని సత్కరించడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొంటూ, తన ఛాంబర్లో విద్యాశాఖ అధికారుల సమక్షంలో ఘనంగా సత్కరించారు.అదేవిధంగా గ్రంథాలయ ఏర్పాటులో ప్రత్యేక శ్రద్ధతో కృషి చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైద్య గణేష్, ఉపాధ్యాయ బృందం, మోతె గ్రామస్తులను కమిషనర్ అభినందించారు.గంగారెడ్డి రచయిత అని తెలుసుకున్న కమిషనర్, ఆయన సంపాదకత్వం వహించిన “లోపలి దారి” పుస్తకాన్ని సాదరంగా కానుకగా స్వీకరించారు.మొత్తంగా మోతె ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయం గ్రామీణ విద్యార్థులకు పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.