ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : శ్రీవెంకటేశ్వర పశువైద్య కళాశాలలో మాంస ఉత్పత్తుల విలువ ఆధారిత ప్రాసెసింగ్ పై రెండు రోజులు పాటు జరిగిన జాతీయ వర్క్ షాప్ ఘనంగా ముగిసింది. ప్లాటినం జూబ్లీ, ఇండియన్ మీట్ సైన్స్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకల పశు ఉత్పత్తుల సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో సుస్థిర ప్రాసెసింగ్ పై సామర్థ్య నిర్మాణం అనే అంశంపై ఈ జాతీయ సదస్సు, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విస్తరణ సంచాలకులు డా. బి. శోభామణి హాజరై మాంస ఉత్పత్తుల విలువను పెంచుతూ రైతులు, మహిళా సంఘాలు, యువత స్టార్టప్ లుగా ఎదిగేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని తెలిపారు.మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా నాణ్యమైన, పోషక విలువలు కలిగిన మాంస ఉత్పత్తులకు దేశ, విదేశీ మార్కెట్లో భారీ డిమాండ్ ఉందన్నారు. పర్యావరణ హిత సుస్థిర ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా పశుపోషకులు, రైతులు, మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలు అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయికి చేరాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా.పి.మాలకొండయ్య మాట్లాడుతూ 70 ఏళ్ల పశువైద్య కళాశాల ప్రస్థానం, 25 ఏళ్ల ఐఎంఎస్ఏ సేవలు దేశ పశుసంవర్ధక రంగ అభివృద్ధిలో కీలకమని తెలిపారు.వర్క్ షాప్ సమన్వయకర్త, విభాగాధిపతి డా.జి.విజయ భాస్కర్ రెడ్డి నివేదిక సమర్పిస్తూ రెండు రోజుల్లో విలువ ఆధారిత మాంస ఉత్పత్తుల తయారీ, సహజ నిల్వ పద్ధతులు, ఆధునిక ప్యాకేజింగ్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలు, వ్యర్థాల పునర్వినియోగం, సుస్థిర ప్రాసెసింగ్ పై ప్రముఖ శాస్త్రవేత్తల ఉపన్యాసాలు, ప్రత్యక్ష శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ధృవపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డా.కె.సుధీర్, డా. జెడ్. నవీన్, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.