లక్ష్మీపతి గూడెం లో ఉచిత పశు వైద్య శిబిరం
జిన్నారం:గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు లక్ష్మీపతిగూడెం, చౌదరిపతిగూడెం ప్రాంతాల్లో గురువారం సత్యసాయి సేవా సంస్థ సౌజన్యంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని వార్డు కౌన్సిలర్ కుమ్మరి కృష్ణ, పశు వైద్యాధికారి శైలజ, గోపాలమిత్ర సంగారెడ్డి క్లస్టర్ సూపర్వైజర్ ఆంజనేయులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువుల్లో వచ్చే గర్భకోశ వ్యాధులు, గొర్రెల వ్యాధులు, దూడల్లో నట్టల నివారణకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. పశువుల్లో ఒక ఈతకు మరో ఈతకు మధ్య 18 నెలల వ్యవధి ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శిబిరంలో భాగంగా పశువులకు గర్భకోశ పరీక్షలు, ఇతర సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించారు. అలాగే పాల దిగుబడి పెంపొందించేందుకు కాల్షియం, మినరల్ మిక్సర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రస్తుత సీజన్‌లో పశువులకు వచ్చే పేను, గోమార్లు తదితర సమస్యల నివారణకు మందులు అందజేస్తూ రైతులకు అవగాహన కల్పించారు. రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం, పశుసంపదను ఆరోగ్యంగా ఉంచడం లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు సాయిరాం, పశువైద్య సిబ్బంది బాబూలాల్, గోపాలమిత్రలు నరేష్, గ్రామస్తులు భవాని, అశోక్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.