కార్తీక స్నానాలకు బ్రాహ్మణ రేవు అనుకూలం కాదా?
నిరుపయోగంగా మారిన స్నానపు షవర్లు.. మహిళలకు తప్పని ఇబ్బందులు
రేవును శుభ్రపరిచి సౌకర్యాలు కల్పించాలని భక్తుల విజ్ఞప్తి
కడియం, మేజర్ న్యూస్ :కార్తీకమాసం ప్రారంభమైనప్పటికీ మండల కేంద్రం కడియంలోని సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న బ్రాహ్మణ రేవు భక్తులకు స్నానాలు చేసేందుకు అనుకూలంగా లేకపోవడం పట్ల స్థానికులు, భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కార్తీకమాసం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, స్వామిమాలధారులు ఈ రేవులో పవిత్ర స్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. మహిళలు సైతం భక్తిశ్రద్ధలతో ఇక్కడ స్నానాలు చేసేవారు.
ముఖ్యంగా మహిళల సౌకర్యార్థం గతంలో ప్రత్యేకంగా బట్టలు మార్చుకునే గది, షవర్లతో కూడిన స్నానపు ఏర్పాట్లు ఉండేవి. అయితే ప్రస్తుతం అవి పూర్తిగా నిరుపయోగంగా మారడంతో మహిళలకు షవర్ల కింద స్నానాలు చేసే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు రేవు పరిసరాలు కూడా శుభ్రతకు నోచుకోకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కార్తీకమాసంలో పవిత్ర స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించాలని భక్తులు కోరుతున్నారు. బ్రాహ్మణ రేవును పూర్తిస్థాయిలో శుభ్రపరచడంతో పాటు మహిళల బట్టలు మార్చుకునే గదిని, షవర్లను మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించి మహిళలు, పురుషులు సురక్షితంగా స్నానాలు ఆచరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.