కడియం వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్.. పట్టించుకునే పోలీసులేరీ?
వంతెనకు ఇరువైపులా చిరు వ్యాపారుల ఆక్రమణలతో మరింత సమస్య..
కడియం ,మేజర్ న్యూస్,:మండల కేంద్రమైన కడియం వంతెనపై ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. తాజాగా వంతెనపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాల రాకపోకలు పూర్తిగా మందగించి ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు..మరోవైపు వంతెనకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారులు తమ వ్యాపారాల వద్దకు వచ్చే వినియోగదారుల కోసం రహదారిపైనే బండ్లు నిలపడం, వాహనాలను అడ్డంగా నిలిపివేయడం ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే ఇరుకుగా ఉండే వంతెన మార్గంలో ఈ ఆక్రమణలు తోడవడంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చిరు వ్యాపారాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా చూడటంతో పాటు ప్రజా రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ వంతెనపై రద్దీ సమయాల్లో ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిపై అడ్డంకులను తొలగించి, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.