గుట్టగూడెంలో వంకా వీరస్వామి, దుబ్బ బోడప్పల వర్ధంతి సభలు
గుట్టగూడెంలో వంకా వీరస్వామి, దుబ్బ బోడప్పల వర్ధంతి సభలు
ములకలపల్లి,సూర్య(మేజర్ న్యూస్) ములకలపల్లి మండలంలోని గుట్టగూడెం గ్రామంలో అమరవీరులు వంకా వీరస్వామి, దుబ్బ బోడప్పల వర్ధంతి సభలు వంకా సురేష్ అధ్యక్షతన జరిగాయి.ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ కొత్తగూడెం జిల్లా నాయకులు ఎస్‌కే ఉమర్ మాట్లాడుతూ, గుట్టగూడెం గ్రామంలో వంకా వీరస్వామి, దుబ్బ బోడప్పల ఆశయాలతో ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ గ్రామంలో పోడు పోగుల రక్షణ కోసం, పోడు భూముల హక్కుల కోసం నిరంతరం పోరాటాల్లో పాల్గొని వందలాది ఎకరాల పోడు భూములు ప్రజలకు, ఆదివాసీలకు దక్కే విధంగా ఉద్యమించారని అన్నారు.ఆదివాసీలు పోరాటాలు చేస్తున్న క్రమంలో వారికి అండగా ఉండి వందల ఎకరాల భూములను సాధించుకోవడంలో బోడప్ప, వీరస్వామిల శ్రమ ఉందని, నిరంతరం వారు పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేశారని, ఈ ప్రాంతంలో భూ పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. వారి ఆశయ సాధన కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వారి బాటలో ప్రజలు నడవాలని పిలుపునిచ్చారు. కమలాపురం గ్రామంలో బత్తుల నాగరాజు అధ్యక్షతన చలమన్న, సరస్వతిల వర్ధంతి సభలు జరిగాయి. ఈ సభలలో అమరవీరుల ఆశయాల కోసం ముందుకు సాగాలని, నిత్యం ప్రజల పక్షాన పోరాడిన చంద్ర పుల్లారెడ్డి, పొట్ల రామ నరసయ్య, నీలం రామచంద్రయ్య, చలమన్న, సోయం గంగులు వంటి వారందరూ భూమి కోసం, భుక్తి కోసం, వారి హక్కుల కోసం, ఆదివాసుల రక్షణ కోసం పనిచేసి అమరులయ్యారని పేర్కొంటూ విప్లవ జోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమంలో సవాళ్ల ఆదినారాయణ, భాస్కర్, రమేష్, రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులు మడి చంద్రం, కొర్రి లక్ష్మి, పెద్దమ్మ లక్ష్మి, నాగరాజు, లక్ష్మి రమణ తదితరులు పాల్గొన్నారు.