ఆరోగ్యాలనిచ్చే ' తాయిలం' సంపదలను పెంచే ఆకు- తమలపాకు జనాలకు శుభాలనిచ్చే తమలపాకు.
రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
సెల్ :: 8247433432
'తాంబూలం' అనే పదం పూర్వకాలం నుంచి, పురాణాల కాలం నుంచి వింటూనే ఉన్నాం. 'తాంబూలం'కు చరిత్రలో, పురాణాలలో, సాహిత్యంలో చాలా ప్రాశస్థ్యం వుంది. ఏ చిన్న శుభకార్యమైనా, అశుభ కార్యమైనా తెలుగు లోగిళ్ళలో
ఈ 'తాంబూలం'దే అగ్రస్థానం. తాంబూలం లేనిదే ఏ ఒక్క చిన్న కార్యక్రమం కూడా ముందుకు నడవదు. నిశ్చితార్ధానికైనా, పూజలకైనా, సత్కార్యాలకైనా, షోడశోపచారాలకైనా తమలపాకులదే ప్రధాన పాత్ర. తమలపాకు లో జీర్ణశక్తిని పెంపొందించే గుణం ఉంది. శరీరానికి వేడి కలిగించే కాల్షియం, పొటాషియం, ఖనిజ లవణాలు ఉన్నాయి కాబట్టే సున్నం, వక్కలతో కలిసి 'తాంబూలం'గా సేవించటం ఆనవాయితీగా వస్తోంది.
తాంబూలం సేవించటంవల్ల కలిగే ఉపయోగాలు చూడండి. కడుపులోని క్రిములను చంపటం, వాతాన్ని, కఫాన్ని, శూలనొప్పిని, అజీర్ణాన్ని, ఆకలిని తగ్గించే అగ్నిమాంధ్యాన్ని పోగొడుతుంది. బుద్ధికి పదును పెడుతుంది. నోటి దుర్గందాన్ని పోగొడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వీర్యానికి వేడిపుట్టించి సంభోగశక్తిని పెంచుతుంది. దంత వ్యాధులను తగ్గిస్తుంది.
తాంబూలం ఎప్పుడు వేసుకోవాలంటే భోజనం తర్వాత, ముందు కూడా, సభలలో పాల్గొనేటప్పుడు, అధికారులను దర్శించే సమయంలో, స్త్రీ సంభోగ సమయంలో తాంబూలం వేసుకుని నమిలి, పిప్పిని ఉమ్మి వేసి నోటిని మంచినీటితో పుక్కిలిస్తే నోటి ద్వారా వ్యాపించే అంటు వ్యాధులు రావు. ముఖం ఆకర్షవంతంగా వుండి యితరులకు సౌభ్రాతృత్వాన్ని, సానుభూతిని కలిగిస్తుంది. సంభోగశక్తి పెంచుతుంది. ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. దంతాలలో ఉన్న మలినాలను, క్రిములనూ, పొట్టలో ఉన్న క్రిములను చంపుతుంది. కాబట్టి 'తాంబూలం' వేసుకోవాలి.
ఎలా వేసుకోవాలంటే? ఐదు లేత తమల పాకులు, ఒక్క వక్క , కుంకుడు గింజంత సున్నం, కొద్దిగా పచ్చకర్పూరం, రెండు లవంగాలు, ఒక ఎలక్కాయ, కొద్దిగా జాజీ కాయతో కూడిన తాంబూలం వేసుకోవాలి.
తాంబూలం వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలండోయ్.అవి ఏంటంటే...?
ఆకులలో ఉండే బూజు, వక్కలలో ఉండే పుచ్చు, సున్నంలో ఉండే రాయి ఈ మూడు ఒకే సారి కలిస్తే కొన్ని నిమిషాల్లో మనిషి ప్రాణం పోతుంది. తాంబూలం
వేసుకునేటప్పుడు ఆకుల తొడిమెలు, చివరలు, పెద్ద ఈనెలు తీసివెయ్యాలి. వక్కలను జాగర్తగా పుచ్చు లేకుండా చూసి కడిగి శుభ్రం చేసుకుని వుంచుకోవాలి. సున్నాన్ని ఎక్కువ నీళ్ళల్లో కలిపి వడపోసుకుని వుంచుకోవాలి. తాంబూలం వేసుకున్నప్పుడు. “మొదటి రెండు నిమిషాలు నమిలి ఆ రసాన్ని వుమ్మివెయ్యాలి. నోటిలో వున్న వేల క్రిములు, విష పదార్థాలు బైటకుపోతాయి. రెండవసారి ఒక నిమిషం తర్వాత నమిలి మళ్ళీ వుమ్మివెయ్యాలి. అప్పుడు నోటిలోని మలినాలు పూర్తిగా పోతాయి. ఆ తర్వాత నమిలి సారాన్ని మింగాలి. కొంతసేపు తాంబూల రసాన్ని మింగిన తర్వాత వుమ్మివెయ్యాలి. మింగకూడదు. తర్వాత నోటిని శుభ్రమైన నీటితో పుక్కిలించి వేసి శుభ్రం చేసుకోవాలి.
తాంబూలాన్ని నోటిలో వుంచుకుని నిద్ర పోకూడదు. తాంబూలం అందరూ వేసుకోవచ్చు కానీ కొందరు వేసుకోకూడదు. ఎవరేసకోకూడదంటే? బాగా ఆకలి మీదున్నవారు, పాము కరిచినవారు. కుష్టు
రోగులు, మూత్ర వ్యాధులున్నవారు, మధుమేహం, కంటి జబ్బులు, మూర్ఛరోగం, ఆయాసం, దగ్గు, హృదయ వ్యాధులు, అతిసారం, విరేచనాలు, పాండు రోగం మొదలైన వ్యాధులున్నవారు ఈ తాంబూలం వేసుకోకూడదు.
తాంబూలం అన్ని సమయాల్లోనూ వేసుకోవచ్చు అనుకోవటం పొరపాటు, ఈ కింది సమయాల్లో వేసుకోకూడదు.
వెలగ, పనస, అరటి, మామిడి పళ్ళు, పాలు, కల్లు, చెరకు పానకం, కొబ్బరి, కొబ్బరి నీళ్ళు, నేతితో తయారైన పదార్థాలు తిన్నప్పుడు వెంటనే తాంబూలం వేసుకోకూడదు.
ఒకవేళ ఇన్ని వుపయోగాలున్నాయి కదా! అని ఎక్కువగా తాంబూలం తింటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటికి ఎదుర్కోటానికి కింది చిట్కాలు వంపయోగించాలి.
తాంబూలం వేసుకున్నప్పుడు తిక్కగా వుండి గుండె పట్టుకోవటం లాంటి వికారాలు ఏర్పడితే చల్లని నీళ్ళు, పుల్లటి వస్తువులు, పెరుగు, తాటికల్లు విరుగుడని చెప్తారు అనుభవజ్ఞులు.
ఇంక తమలపాకుల్లో వున్న రకాలు చూడండి. తమలపాకుల్లో దేశవాళీ, బంగ్లా, మిఠాయ, పాన్ అని మూడు రకాలుంటాయి. ఆంధ్రా, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర మొదలగు చోట్ల దేశవాళీ, ఒరిస్సాలో బంగ్లా, బెంగాల్ లో మిఠాయి పానీ రకాలను పండిస్తారు. దేశం మొత్తం మీద దేశవాళీ ఎక్కువగా పండుతుంది.
తాంబూలం అంటే తమలపాకు, సున్నం, వక్క కలగలిసినవి కాబట్టి, ఇందులో తమలపాకు ప్రధానం కాబట్టి తమలపాకు పెంపకం గురించి కొద్దిగా తెలుసుకుందాం.
తమలపాకు తోటలకు తడి చాలా అవసరం. కాని ఎక్కువగా తడి ఉండరాదు. కాబట్టి మెరకలో పండించాలి. తమల పాకు విత్తనాలు చల్లటానికి సుమారు తొంభై రోజుల ముందుగా అవిసె విత్తనాలు చల్లుతారు. అవిసె మొక్కలు సుమారు నాలుగు అడుగులు ఎత్తు పెరిగాక తమల పాకు విత్తనాలు చల్లుతారు. తమలపాకు విత్తనాలు చల్లిన నెలకు మొలకెత్తుతాయి. మొలకెత్తిన మొక్కలకు రసాయినిక ఎరువులు, ఆముదాల పిండి, పెంట మొదలైన సంప్రదాయ ఎరువులు వాడతారు. తీగలాగ పాకి ఎదిగిన తమలపాకులను అవిసె మొక్కలకు నెలకో కట్టు చొప్పున కడుతుంటారు. తమలపాకు విత్తనాలు నాటిన ఏడు నెలలకు మొదటి కోత కోస్తారు. ఆ పై నెలకొకసారి కోస్తారు. ఇలా రెండు సంవత్సరాల వరకూ తమలపాకు తోట బతికే ఉంటుంది. నెలకు ఎకరానికి ఐదు వేల కట్టలవుతాయి. ఇలాంటి 20 కట్టలతో ఒక గంప నిండుతుంది. ఈ గంపలు సుమారు 800 ఐతే ఒక లారీ లోడు అవుతుంది.
మన ప్రాంతాలనుండి అలా లోడు అయిన లారీలు నాగపూర్, పూనా, బోంబాయి, మన్మాడులకు వెళ్తాయి.
ఇంతటి చరిత్ర కలిగిన తమలపాకులతో కలగలిసిన 'తాంబూలం' కు సాహిత్యంలో ఎలా చాటువులుగా చోటుచేసు కున్నదో చూడండి.
ఒక పండితుడు వక్కలు, ఆకులు పట్టుకుని దారిలో వెళ్ళుతున్న ఒక అందమైన యువతిని సున్నం
పెట్టమని ఇలా అడిగాడట.
"పర్వతశ్రేష్ట పుత్రికాపతి విరోధి
యన్న పెండ్లము అత్తను గన్న తండ్రి
పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ
సున్నమించక తేగదే సుందరాంగి"
అంటే... పర్వతశ్రేష్టుడు హిమవంతుడు. అతని పుత్రిక పార్వతి, ఆమె పతి శివుడు, అతని విరోధి మన్మథుడు, వాని యన్న బ్రహ్మ అతని పెండ్లాము సరస్వతి, ఆమె అత్త లక్ష్మి, ఆమె తండ్రి సముద్రుడు సముద్రుని పెద్ద బిడ్డ పెద్దమ్మ (దరిద్ర దేవత), 'ఓసీ పెద్దమ్మా (దరిద్ర దేవతా) సున్నము తేవే' అని అడిగాడు.
వెంటనే ఆ జవ్వని తానేమీ తక్కువ కాదు అన్నట్లుగా
"శత పత్రంబుల మిత్రుని
సుతు జంపిన వాని బావ సూనిని మామన్
సతతము దాల్చెడునాతని
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో" అంది.
అంటే.. శతపత్రముల మిత్రుడు సూర్యుడు. అతని సుతుడు కర్ణుడు, వానిని చంపిన వాడు అర్జునుడు. అతని బావ కృష్ణుడు, అతని కొడుకు మన్మదుడు, వాని మామ చంద్రుడు, అతనిని దాల్చిన వాడు శివుడు, శివుని కొడుకు వినాయకుడు. అతని వాహనము ఎలుక, దాని వైరి పిల్లి, వాని వైరి కుక్క అంటూ 'ఓరి కుక్కా ఇదిగో సున్నం' అనే చాటువు సాహిత్యంలో ప్రముఖంగా కనబడుతుంది..
అదే విధంగా ఆంధ్ర కవితా పితామహుడుగా పేరొందిన అల్లసాని పెద్దన కవిత్వం చెప్పాలంటే కొన్ని వస్తువులు కావాలంటూ అందులో తాంబూలం కూడా కావాలన్నాడు.
'నిరువహతిస్థలంబు, రమణీ ప్రియ దూతిక తెచ్చియిచ్చు క
ప్పుర విడె మాత్మకింపగు భోజనమూ
యెల మంచముప్పు త
ప్పరయు రసజ్ఞులోహ తెలియంగల
లేఖక పాటకోత్తముల్
దొరకిన గాక వూరకకృతుల్ రచియింపు
మటన్న శక్యమే!"
అంటూ చక్కని పద్యంలో 'తాంబూలం' ప్రాశస్త్యాన్ని వివరించారు.
ఒక్క సాహిత్యంలోనే కాదు సినిమాలలో కూడా ఉంది.
'ఆకులు పోకలు ఇవ్వద్దు
నా నోరు ఎర్రగ చెయ్యొద్దు
నాలో ఆశలు రేపొద్దు
నా వయసుకు అల్లరి నేర్పొద్దు" అంటూ పాటలు.. 'తాంబూలాలు ఇచ్చేశా ఇహ తన్నుకు చావండి' అంటూ కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు
మాటలు ఎన్నో కోకొల్లలుగా తాంబూలాన్ని గుర్తుకు చేస్తూ కనిపిస్తాయి.
అదండి బాబూ! ఆరోగ్య చిట్కాలో ముడిపడ్డ తమలపాకు చరిత్ర . ఆయుర్వేదం లో ప్రధాన పాత్ర పోషిస్తూ మన నోరు పండించటమేకాక జీవితాన్ని కూడా పండిస్తోంది తమలపాకు.
ఆరోగ్యాలనిచ్చే ' తాయిలం' సంపదలను పెంచే ఆకు- తమలపాకు జనాలకు శుభాలనిచ్చే తమలపాకు.
తమలపాకు వేసుకోండి
ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందండి