విదేశాలకు వెళ్లే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి.. మన కోసం ఎదురుచూస్తున్న కళ్లను మరచిపోవద్దు!
విదేశీ ప్రయాణం ఒకప్పుడు కల. నేడు అది ప్రతి ఇంటి ఆశగా మారుతోంది. ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాలు, ఆర్థిక స్థిరత్వం కోసం యువత దేశాలు దాటి వెళ్తోంది. పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆ ప్రయాణంలో వెనుక మిగిలిపోతున్న కొన్ని జీవితాల గురించి కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
ఒకప్పుడు పిల్లల అడుగుల చప్పుళ్లతో సందడిగా ఉన్న ఇళ్లు, నేడు వృద్ధుల నిశ్శబ్దానికి నిలయాలవుతున్నాయి. అవసరమైనప్పుడు పలకరించడానికి ఫోన్ ఉంది, అనారోగ్యానికి వైద్యం ఉంది, చూసుకోవడానికి మనుషులను నియమించే ఆర్థిక స్థోమత ఉంది. కానీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కావాల్సింది కేవలం సౌకర్యాలు మాత్రమేనా?
ఎనభై ఏళ్ల వయసులో అనారోగ్యంతో మంచాన పడిన తండ్రికి కొడుకు స్వయంగా చేయూతనివ్వలేని పరిస్థితి, తల్లి పండుగ రోజున ఒంటరిగా గడపాల్సిన పరిస్థితి మనల్ని ఆలోచింపజేయవా? చివరి చూపు కూడా దక్కని దూరాలకు బంధాలు వెళ్లిపోవడం అభివృద్ధికి సంకేతమా?
పిల్లలకూ బాధ్యతలుంటాయి. ఉద్యోగాలు, కుటుంబాలు, అక్కడి జీవన పరిస్థితులు వారిని వెనక్కి రానివ్వకపోవచ్చు. కానీ మన కోసం జీవితమంతా కష్టపడిన తల్లిదండ్రుల కోసం కొంత సమయం కేటాయించలేమా?
మరోవైపు, పిల్లలు విదేశాల్లో ఉన్నారని గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం వారిని దూరం పంపుతున్నప్పుడు, మన వృద్ధాప్యానికి కావాల్సిన తోడు గురించి ఆలోచిస్తున్నామా?
విదేశాల్లో సంపాదించడమే జీవితంలో విజయం కాదు. మన దేశంలోనే మన సామర్థ్యానికి తగిన అవకాశాలను వెతుక్కుంటూ, కష్టపడి ఎదుగుతూ, కన్నవారికి దగ్గరగా ఉండే జీవితాన్ని కూడా ఎంచుకోవచ్చు.
మన కోసం జీవితాన్నే ధారపోసిన తల్లిదండ్రులకు చివరి రోజుల్లో మన సమయాన్ని కూడా ఇవ్వలేకపోతే, మన సంపాదనకు అర్థం ఏమిటి?
దేశాలు దాటే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. అదేమీ అస్తిత్వమా? లేక మీరు కోల్పోతున్నది ఇంకేమైనా ఉందా!
మీకోసం ఎదురు చూస్తున్న మీ తల్లిదండ్రుల కళ్ళల్లోనే మీ ప్రపంచం ఉండొచ్చు.
..సుధేష్ణాదేవి జంగంగారి✍
రచయిత్రి. హైదరాబాద్, 9177938246