నంబూరు–ఎర్రుపాలెం రైల్వే లైన్ భూసమీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: నంబూరు–ఎర్రుపాలెం నూతన బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి సమ్మతి పత్రాల స్వీకరణ, భూసేకరణ ఒప్పంద పత్రాలైన ఫారం-వి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి భూసమీకరణ పురోగతిపై అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. అమరావతి మండలంలోని ఎండ్రాయి, కార్లపూడి, వైకుంఠపురం గ్రామాల్లో సేకరించాల్సిన భూముల వివరాలు, రైతుల నుంచి ఫారం-ఐ సమ్మతి పత్రాల స్వీకరణ, ఫారం-వి పూర్తి చేసిన అంశాలపై ఆరా తీశారు. సమీక్షలో వెల్లడైన వివరాల ప్రకారం మూడు గ్రామాల్లో రైల్వే లైన్ నిర్మాణానికి మొత్తం 119.6125 ఎకరాల భూమి అవసరమవుతోంది. ఇందులో 105.09 ఎకరాలకు సంబంధించి రైతుల నుంచి ఫారం-ఐ సమ్మతి పత్రాలు స్వీకరించారు. మరో 4.52 ఎకరాలకు సంబంధించి సమ్మతి ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. అదేవిధంగా 91.83 ఎకరాలకు ఫారం-వి ప్రక్రియ పూర్తికాగా, మరో 13.315 ఎకరాలకు సంబంధించి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం 256 మంది రైతులకు సంబంధించి 245 మంది నుంచి ఫారం-ఐ సమ్మతి పొందగా, 210 మంది రైతులకు సంబంధించిన ఫారం-వి ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వివరించారు. భూసమీకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలు, భూముల సర్వే, మ్యుటేషన్, వారసత్వ వివాదాలు, ఇతర న్యాయపరమైన అంశాలను సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించా లని కలెక్టర్ సూచించారు. రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసమీకరణలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, పెండింగ్‌లో ఉన్న సమ్మతి పత్రాలు, ఫారం-వి ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
మల్లికార్జున రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి…