జాతీయ రహదారిపై వేలగని దీపాలు
జాతీయ రహదారుల్లో వెలగని విద్యుత్ దీపాలు 'నంది' సర్కిల్ హైవే బ్రిడ్జిలు వద్ద వెలగని విద్యుత్ దీపాలు... నిత్యం ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు.... శ్రీకాళహస్తీశ్వర దర్శనానికి వచ్చే భక్తులకు తప్పని ఇక్కట్లు... చోద్యం చూస్తున్న 'మేఘ' కంపెనీ అధికారులు.. శ్రీకాళహస్తి : జాతీయ రహదారుల్లో విద్యుత్ దీపాలు వెలగడం లేదు. 'నంది' సర్కిల్ హైవే బ్రిడ్జిలు వద్ద విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ద్విచక్ర వాహనదారులు, పాదాచార్లు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. శ్రీకాళహస్తీశ్వర దర్శనానికి వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇంత జరుగుతున్న 'మేఘ' కంపెనీ అధికారులు, జాతీయ రోడ్డు భద్రత రవాణా అధికారులు చోద్యం చూస్తున్నారు. నాయుడుపేట నుంచి పూతలపట్టు హైవే వరకు ఆరు వరుసల హైవే రోడ్డు 'మేఘ' కంపెనీ నిర్మించింది. పలు మలుపులు వద్ద విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేసి లైట్లు అమర్చారు. అయితే వీటి నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారు. బసవయ్య పాలెం హైవే వద్ద సుమారు 15 రోజులుగా విద్యుత్ లైట్లు వెలక్కపోవడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అండర్ బ్రిడ్జి వద్ద లైట్లు లేకపోవడంతో నిత్యం రాత్రి వేళలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బసవయ్యపాలెం హైవే వద్ద ఫారెస్ట్ చెక్ పోస్ట్, మార్కెట్ యార్డ్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ సర్కిల్ వద్ద టూ టౌన్ పోలీసులతో పాటు నిత్యం తనిఖీలు నిర్వహిస్తుంటారు. హైవే పెట్రోలింగ్ అధికారులు కూడా సంచరిస్తుంటారు. శ్రీకాళహస్తీశ్వర దర్శనానికి వచ్చే భక్తులు కూడా బసవయ్య పాలెం హైవే వద్ద దిగి శ్రీకాళహస్తీశ్వరాలయానికి వస్తుంటారు. విద్యుత్ లైట్లు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ఈ సర్కిల్ వద్ద చీకటమయం కావడంతో పోలీస్ అధికారులు తనిఖీలు కూడా నిర్వహించలేకపోతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో యదేచ్చగా ఇసుక, పశువులు రవాణా, కలప, ఎర్రచందనం, రేషన్ బియ్యం జోరుగా అక్రమ రవాణా జరుగుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైవేలో పలుచోట్ల విద్యుత్తు లైట్లు వెలగకపోవడంపై పలు విమర్శలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 'మేఘ' కంపెనీ మేర్లపాకు టోల్ ప్లాజా వద్ద వాహనదారుల వద్ద నుంచి అధిక మొత్తంలో టోల్ వసూలు చేసే కంపెనీ అధికారులు జాతీయ రోడ్డు భద్రత నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అవసరమైన అంత మంది విద్యుత్తు లైన్ మ్యాన్లు లేకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా ఘోర రోడ్డు ప్రమాదాలు జరగకముందే జాతీయ రోడ్డు భద్రతపై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి