పాట్నా విమానాశ్రయంలో నితీష్ కుమార్‌తో భేటీ
సూర్య జాతీయ డెస్క్: పాట్నా విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కలవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం పాట్నా చేరుకున్న ప్రధాని మోదీకి నితీష్ కుమార్, ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరోగి సహా పలువురు ఎన్డీయే నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నితీష్ కుమార్‌తో ఆప్యాయంగా పలకరించిన ఫొటోలను ప్రధాని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంటూ, నితీష్ జీని కలవడం గొప్ప సంతోషాన్ని ఇచ్చిందని వెల్లడించారు. పాట్నా నుంచి వైశాలికి బయలుదేరిన ప్రధాని, గంగా నదిపై నిర్మించిన ఆరు వరుసల 'నితీష్ సేతు' ప్రారంభోత్సవంతో పాటు రాజాపాకర్‌లోని జాఫర్‌పట్టి పారిశ్రామిక ప్రాంతంలో బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా బీహార్ వ్యాప్తంగా సుమారు రూ. 34,470 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రహదారులు, విద్యుత్, పట్టణ మౌలిక సదుపాయాలు, జలవనరులు, విద్య, ఆరోగ్యం, రవాణా రంగాలకు సంబంధించిన ఈ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి కొత్త వేగాన్ని ఇస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా రూ. 4,280 కోట్ల అంచనా వ్యయంతో 19.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన కచ్చి దర్గా-బిదుపూర్ ఆరు వరుసల నితీష్ సేతు ప్రాజెక్టు ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో 9.7 కిలోమీటర్ల ప్రధాన వంతెనతో పాటు సుమారు 10 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్లు ఉన్నాయి. పాట్నా, ఉత్తర బీహార్ మధ్య అనుసంధానత మెరుగుపడటంతో పాటు మహాత్మా గాంధీ సేతు, జేపీ సేతుపై రద్దీ తగ్గి, రాఘోపూర్ దియారా ప్రాంత ప్రజలకు పాట్నాకు చేరుకోవడం మరింత సులభతరం అవుతుంది.
జాఫర్‌పట్టి ప్రధాన కార్యక్రమంలో రూ. 15,600 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు సుమారు రూ. 14,450 కోట్ల విలువైన పథకాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారులు, విద్యుత్ మౌలిక సదుపాయాలు, పట్టణ తాగునీరు, మురుగునీటి పారుదల పథకాలు, విద్యా, వైద్య రంగాల ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ లబ్ధిదారులైన 26,900 మందికి పైగా కుటుంబాల గృహ ప్రవేశ కార్యక్రమం కూడా ఈ వేదికగా జరిగింది.
పట్టణ ప్రజా రవాణాను బలోపేతం చేసి కాలుష్య రహిత ప్రయాణాలను ప్రోత్సహించేందుకు బీహార్ కోసం 100 పీఎం ఈ-బస్సులను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. జాఫర్‌పట్టి ప్రాంతంలో పారిశ్రామిక పార్కు, కారిడార్ ఏర్పాటు వంటి చర్యలు రాష్ట్ర పారిశ్రామిక ప్రణాళికలకు ఊతమిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ పర్యటన ద్వారా బీహార్‌లో పెట్టుబడుల రాక, పారిశ్రామిక విస్తరణ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని స్థానిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.