రేవంత్ రెడ్డి ప్రసంగంలో సౌండ్ ఎక్కువ.. సొల్యూషన్ తక్కువ!
సంగారెడ్డి ; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలో అభివృద్ధి కంటే విమర్శలు, పరిష్కారాల కంటే ఆరోపణలే ఎక్కువగా ఉన్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, నియోజకవర్గాల అభివృద్ధి, నిధుల కేటాయింపులపై స్పష్టత ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదన్నారు.సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభపై సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.ముఖ్యమంత్రి వస్తున్నారంటే ప్రజలు అభివృద్ధి పనులకు నిధులు, కొత్త హామీలు ప్రకటిస్తారని ఆశిస్తారని అన్నారు. కానీ సిద్దిపేట సభలో 26 నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను తరలించి ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్లీనరీ నిర్వహించినట్లుగా వ్యవహరించారని ఆరోపించారు. సభలో ప్రజా సమస్యలు, అభివృద్ధి, నిధుల కేటాయింపులపై మాట్లాడకుండా తిట్ల దండకంతోనే ప్రసంగాన్ని ముగించారని ఎద్దేవా చేశారు.తన పాలనలోని వైఫల్యాలను మాజీ మంత్రి హరీష్ రావు ఎండగడుతున్నారనే అసహనం, రాజకీయ ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ పనితీరుపై బహిరంగంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారని గుర్తుచేస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. రాజకీయ విమర్శలతో ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో ఉపయోగిస్తున్న భాష, చేస్తున్న వ్యాఖ్యల్లో పొంతన కనిపించడం లేదని విమర్శించారు. సిద్దిపేట సభ కేవలం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లను విమర్శించేందుకే నిర్వహించినట్లుందని అన్నారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల కేటాయింపులపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయలేదని ఆరోపించారు.గతంలో కేసీఆర్ సభలకు వచ్చినప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గాలకు అభివృద్ధి పనులు, నిధులు మంజూరు చేసేవారని గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సభలు మాత్రం ప్రతిపక్ష నాయకులపై విమర్శలకే పరిమితమవుతున్నాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి భాష, వ్యవహారశైలిపై గవర్నర్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని, వారి గురించి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని హితవు పలికారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.సంగారెడ్డికి ముఖ్యమంత్రి వచ్చి ఎలాంటి నిధులు కేటాయించకుండా హడావుడి చేసి వెళ్లిపోయారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రతి వార్డుకు రూ.8 కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేదని అన్నారు. కనీసం నిధుల కేటాయింపుపై కూడా ప్రకటన చేయకపోవడం విచారకరమన్నారు.ముఖ్యమంత్రి ప్రారంభించిన రోడ్డు పనులు సైతం ఇంకా పూర్తికాలేదని, అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, మనోహర్ గౌడ్, వేణుగోపాలస్వామి, వాడే మల్లేశం, కసిని శ్రీకాంత్, నాయికోటి నవీన్, శ్రవణ్ రెడ్డి, జీవీ శ్రీనివాస్, నందకిషోర్, అంజాద్, అజీమ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.