ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకలు
సూర్య జాతీయ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో శనివారం పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యువ ఆవిష్కర్తలు సరిహద్దులు దాటి కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని, దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ప్రయాణంలో ఈ సంస్థ 75 ఏళ్ల ఘన వారసత్వం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. దేశంలోని తొలి ఐఐటీగా ఘనతకెక్కిన ఐఐటీ ఖరగ్‌పూర్, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాల నుంచి అంతరిక్ష పరిశోధన, అణుశక్తి, సమాచార సాంకేతికత వరకు అనేక రంగాల్లో దేశ పరివర్తనకు దోహదపడిందని ప్రశంసించారు.
సంస్థ చారిత్రక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, ఈ ప్రాంగణం ఒకప్పుడు స్వాతంత్ర్య సమరయోధులను నిర్బంధించే శిబిరంగా ఉండేదని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. అనంతరం అది ఆత్మవిశ్వాసం, స్వయం సమృద్ధి లక్ష్యాలకు తోడ్పడే యువ మేధావులను తీర్చిదిద్దే కేంద్రంగా ఎదిగిందని చెప్పారు. ఆలోచనా పరిమితులను అధిగమించినప్పుడే దేశాలు తమ నిజమైన సామర్థ్యాన్ని గ్రహిస్తాయని పేర్కొంటూ, ఇటీవలి సంవత్సరాలలో భారత విధానాన్ని పరిమితులను ఛేదించి అవకాశాలను అందిపుచ్చుకోవడం అనే దృక్పథంగా అభివర్ణించారు.
పేదరిక నిర్మూలన, సెమీకండక్టర్ మిషన్, ప్రైవేట్ సంస్థలకు అంతరిక్ష రంగాన్ని తెరవడం వంటి అంశాలను ఉదాహరణలుగా చూపుతూ, సంప్రదాయ పరిమితులను సవాలు చేయడం ద్వారానే దేశం పురోగతి సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. సెమీకండక్టర్ ప్రాజెక్టులు, అంతరిక్ష స్టార్టప్‌లలో ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థుల కృషిని కొనియాడుతూ, పూర్వ విద్యార్థి పవన్ కుమార్ చందన స్థాపించిన స్కైరూట్ ఏరోస్పేస్ వంటి సంస్థలను ప్రస్తావించారు. రాబోయే రెండు దశాబ్దాలు భారత అభివృద్ధికి అత్యంత కీలకమని, 2047 నాటికి నేటి విద్యార్థులలో చాలామంది నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు.
జాతీయ సవాళ్లను గుర్తించి వాటికి పరిష్కారాలు చూపే దిశగా దేశమే ప్రథమం అనే భావనతో పనిచేయాలని విద్యార్థులకు ప్రధానమంత్రి సూచించారు. క్యాంపస్‌లోని హాస్టళ్లు, దీపావళి వేడుకల వెలుగుల వంటి సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ, దశాబ్దాలుగా జాతి నిర్మాణంలో సంస్థ పోషించిన పాత్రను అభినందించారు. చివరగా స్వామి వివేకానంద మాటలను స్మరిస్తూ, లక్ష్యం చేరే వరకు ఆగకుండా ముందుకు సాగాలని విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు మోదీ దిశానిర్దేశం చేశారు.