ఐటీఐ టాపర్లను సత్కరించనున్న ప్రధాని మోదీ
సూర్య జాతీయ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శనివారం నిర్వహించనున్న ఐదవ జాతీయ నైపుణ్య స్నాతకోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక శిక్షణ సంస్థలు, ఇతర నైపుణ్య శిక్షణ కేంద్రాల నుంచి జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 52 మంది టాపర్లను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించనున్నారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ నిర్వహించే ఈ వార్షిక ప్రతిష్టాత్మక వేడుకను ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
లక్నోలోని విభూతి ఖండ్ ప్రాంతంలో ఉన్న ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 5:15 గంటలకు వేదిక వద్దకు చేరుకోనున్న ప్రధాని మోదీ, 5:30 గంటల నుంచి 6:45 గంటల వరకు వేడుకల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి కూడా హాజరుకానున్నారు. శుక్రవారం కన్నుమూసిన తన తల్లి సావిత్రి దేవి అంత్యక్రియలను ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకలో పాల్గొంటారు.
ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ 2025 ఫలితాల ఆధారంగా ఎంపికైన 52 మంది టాపర్లను ఈ జాతీయ వేడుకలో సన్మానించనున్నట్లు ఉత్తరప్రదేశ్ వృత్తి విద్యా శిక్షణ డైరెక్టర్ అభిషేక్ సింగ్ తెలిపారు. వీరిలో క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ కింద ముగ్గురు ఆల్ ఇండియా టాపర్లు, దివ్యాంగుల విభాగంలో ఇద్దరు, సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యం ఉండే ట్రేడ్‌లలో విజేతలుగా నిలిచిన ఇద్దరు మహిళలు, క్రాఫ్ట్స్ ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ కింద ముగ్గురు టాపర్లు కలిపి మొత్తం పది మంది ప్రధానమంత్రి చేతుల మీదుగా వేదికపై అవార్డులు అందుకోనున్నారు. లక్నో, పొరుగు జిల్లాల నుంచి 5,000 మందికి పైగా ఐటీఐ విద్యార్థులు, శిక్షకులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో లక్నో నగరవ్యాప్తంగా సుమారు 4,400 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎనిమిది మంది డీసీపీలు, పది మంది అదనపు డీసీపీలు, 34 మంది ఏసీపీలు, 114 మంది ఇన్‌స్పెక్టర్లతో పాటు భారీ సంఖ్యలో సబ్ ఇన్‌స్పెక్టర్లు, మహిళా పోలీసులు, కానిస్టేబుళ్లను విధుల్లో నియమించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బలగాలతో పాటు ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కాన్‌స్టాబులరీ, ర్యాపిడ్ రియాక్షన్ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, స్నైపర్, యాంటీ డ్రోన్ వ్యవస్థలతో కూడిన ప్రత్యేక బృందాలు పహారా కాస్తున్నాయి.