BREAKING
కుకునూరులో యువకుడిపై దాడి.. బాధితుడిని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నాయకులు ఆత్మనిర్భర్ బీహార్ నిర్మాణమే లక్ష్యం అంక్సాపూర్‌లో చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత చేయూత పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన సర్పంచ్ కాపర్ ఆర్మర్డ్ కేబుల్స్ ధరలను 6 శాతం వరకు తగ్గించిన ఫినోలెక్స్ కేబుల్స్.. ఇఫ్ఫీ 2026లో క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ఆరవ ఎడిషన్ ప్రారంభం గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం వ్యాధులు ప్రబలకుండా సమష్టిగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకలు అద్వైత రథయాత్రను ప్రారంభించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కబడ్డీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు..! హుస్నాబాద్ ప్రాంత కబడ్డీ క్రీడాకారులకు ఘన సన్మానం..! బీజేపీలో చేరిన యువకులు 8వ వేతన సంఘం... ఇఫ్ఫీ 2026లో ఏడుగురు సినీ దిగ్గజాలకు నివాళి అంతంపల్లిలో చేయూత ఆసరా పెన్షన్ల పత్రాల పంపిణీ

ఇఫ్ఫీ 2026లో ఏడుగురు సినీ దిగ్గజాలకు నివాళి

Select Suryaa Now
ఇఫ్ఫీ 2026లో ఏడుగురు సినీ దిగ్గజాలకు నివాళి

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 1926లో జన్మించిన ఏడుగురు ప్రముఖ భారతీయ సినీ దిగ్గజాలకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. హిందీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ భాషలకు చెందిన ఐదు పునరుద్ధరించిన చిత్రాల ప్రదర్శనల ద్వారా ఈ శతజయంతి నివాళిని నిర్వహిస్తున్నారు. ప్రముఖ బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్, దర్శకుడు శక్తి సామంత, సంగీత దర్శకుడు ఓ.పి. నయ్యర్, మరాఠీ నటుడు సూర్యకాంత్ మంధారే, మలయాళ నటుడు ప్రేమ్ నజీర్, బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్, బాంబే రవిగా ప్రసిద్ధి చెందిన సంగీత స్వరకర్త రవి శంకర్ శర్మ సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నారు.

భారతీయ సినీ వారసత్వాన్ని పరిరక్షించడం, డిజిటలైజ్ చేయడం, పునరుద్ధరించడం లక్ష్యంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ కింద నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ చిత్రాలను ఆధునిక సాంకేతికతతో పునరుద్ధరించింది. ఉత్తమ్ కుమార్ నటించిన 1965 నాటి బెంగాలీ క్లాసిక్ చిత్రం చౌరింఘీ, శక్తి సామంత దర్శకత్వం వహించి ఓ.పి. నయ్యర్ సంగీతం అందించిన కాశ్మీర్ కి కలి, సూర్యకాంత్ మంధారే నటించిన సాధి మానసే, ప్రేమ్ నజీర్ నటించిన తులాభారం, రాజ్ కుమార్ నటించి రవి సంగీతం సమకూర్చిన యశ్ చోప్రా మల్టీస్టారర్ చిత్రం వక్త్‌లను ప్రదర్శనకు ఎంపిక చేశారు.

1948లో నటనా రంగ ప్రవేశం చేసిన ఉత్తమ్ కుమార్ 200కు పైగా చిత్రాల్లో నటించి బెంగాలీ సినిమాలో అత్యంత ఆదరణ పొందిన తారగా నిలిచారు. శక్తి సామంత హిందీ, బెంగాలీ భాషల్లో 43 ఫీచర్ చిత్రాలకు దర్శకత్వం వహించగా, విలక్షణ బాణీలతో పాటు మొహమ్మద్ రఫీ, ఆశా భోంస్లే, గీతా దత్ వంటి గాయకులతో కలిసి చేసిన స్వరకల్పనల ద్వారా ఓ.పి. నయ్యర్ ప్రత్యేక గుర్తింపు పొందారు. సూర్యకాంత్ మంధారే ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన కెరీర్‌లో వందకు పైగా సినిమాల్లో నటించారు.

మలయాళ సినిమాలో అగ్రగామిగా నిలిచిన ప్రేమ్ నజీర్ 700కు పైగా చిత్రాల్లో కథానాయకుడిగా నటించడం, నటి షీలా సరసన 130 చిత్రాల్లో కనిపించడం వంటి ఘనతలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించి, 1983లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రత్యేకమైన గొంతు, సంభాషణల శైలితో రాజ్ కుమార్ ప్రేక్షకులను అలరించగా, చౌధ్వి కా చాంద్, గుమ్రాహ్, వక్త్, హుమ్రాజ్ వంటి చిత్రాలకు బాంబే రవి సంగీతం అందించారు. పరిణయం, సుకృతం చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డులను ఆయన గెలుచుకున్నారు. ఈ శతజయంతి ప్రదర్శనల ద్వారా భావితరాలకు సినీ వారసత్వాన్ని చేరవేయడంతో పాటు భారతీయ సినిమా వైవిధ్యాన్ని చాటిచెప్పాలని ఇఫ్ఫీ లక్ష్యంగా పెట్టుకుంది.