telangana
ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం
సూర్య నస్పూర్ : ప్రతి కుటుంబానికి బీమా రక్షణ కల్పించి, ఆపద సమయంలో ఆర్థిక భరోసా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య అన్నారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ వార్డులో మేయర్ దర్ని మధుకర్, కమిషనర్ అన్వేష్‌తో కలిసి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రేషన్ కార్డులు కలిగిన అర్హులైన కుటుంబాలు ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో నామినీకి రూ.5 లక్షల బీమా పరిహారం అందించే అవకాశం ఉంటుందని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ శిబిరాలకు హాజరై తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ పథకం ద్వారా కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన వారు ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాచకొండ గోపాల్‌రావు, అగ్గు సాగర్, రాజేశ్వరి, ఖలీద్, సంపత్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.