మనస్తాపంతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
గాజువాక, మేజర్ న్యూస్ : తీవ్ర మానసిక వేదనతో ఓ కార్పెంటర్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఇందిరా కాలనీకి చెందిన వల్లూరి సురేష్ (37) కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య కనక మహాలక్ష్మి, ఒక కుమారుడు ఉన్నారు. సుమారు ఏడాది క్రితం సురేష్ తల్లి మరణించడంతో అప్పటి నుంచి అతను తీవ్ర మనస్తాపానికి గురై, మానసికంగా కుమిలిపోతూ బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం సేవించిన అనంతరం ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్య కనక మహాలక్ష్మి, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, ఈ ఘటనతో ఇందిరా కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడి భార్య కనక మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టర్ : పీ.కోటిరెడ్డి, గాజువాక ఇంచార్జ్, విశాఖపట్నం