రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చెయ్యాలి
మెదక్ ప్రతినిధి ; మెదక్ జిల్లా పరిధిలో రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్లో ఆర్డీవోలు, తాహసిల్దార్లతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..రోడ్డు నిర్మాణాల కోసం భూములు కోల్పోతున్న రైతులు, భూ యజమానులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయమైన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు.సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భూసేకరణ, భూముల విలువ నిర్ధారణ, పరిహారం చెల్లింపు ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా పరిహారం అందించాలని స్పష్టం చేశారు.అభివృద్ధి పనులకు భూసేకరణ ప్రక్రియ కీలకమైనందున అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి పనుల్లో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్,ఆర్డీవోలు రమాదేవి, భావయ్య, ఏడి సర్వే కిషన్, తాహాసిల్దారులు శ్రీనివాస్, కమలాద్రి, రజని, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.