ఎన్నికల వేళ.. పల్లె కదిలిపోతోంది!
ఎన్నికల వేళ.. పల్లె కదిలిపోతోంది!
ఓటు కంటే పొట్టకూటికే ప్రాధాన్యం..
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పల్లెలు వలసబాట పడుతున్న ప్రజలతో వెలవెలబోతున్నాయి. ఒకవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా, మరోవైపు రైతులు, వ్యవసాయ కూలీలు మాత్రం పొట్టకూటి కోసం పల్లెలను విడిచి పట్టణాల బాట పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవడం కంటే కుటుంబ పోషణే ముఖ్యమని భావిస్తూ వందలాది మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్న పరిస్థితి నెలకొంది.
ఓటు కంటే ఉపాధే ముఖ్యం!
ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు ఓట్ల కోసం గ్రామాలకు వస్తున్నా, తమ కష్టాలు మాత్రం తీరడం లేదని పలువురు రైతులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు, ఆర్థిక సాయం తమ కుటుంబాల ఆకలి తీర్చలేవని, శాశ్వత ఉపాధి కల్పిస్తేనే తమకు భరోసా ఉంటుందని అంటున్నారు. మరోవైపు వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక అప్పుల పాలయ్యామని, ఉపాధి లేక గ్రామాల్లో ఉండలేక వలస వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.
కరువు పరిస్థితులు.. పట్టించుకునేవారేరీ?
వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయని, పంటలు పండక పెట్టుబడులు నష్టపోయామని రైతులు చెబుతున్నారు. నాలుగు నెలలుగా వర్షాలు లేక వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని, పంటల బీమా, నష్టపరిహారం వంటి అంశాలపై ఆశించిన భరోసా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని 26 మండలాల్లో 15 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించగా, మిగిలిన మండలాలకు ఆ జాబితాలో చోటు దక్కకపోవడంపై రైతులు, వ్యవసాయ కూలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మిగనూరు, మంత్రాలయం ప్రాంతాల్లో వలసల ప్రభావం
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు మండలాలతో పాటు మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోసిగి, మంత్రాలయం, పెద్దకడుబూరు మండలాల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. వ్యవసాయ భూముల్లో పంటలు సరిగా పండకపోవడంతో రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆయా మండలాలకు కరువు జాబితాలో చోటు దక్కలేదని వారు ఆవేదన చెందుతున్నారు.
గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరుకు వలసలు
గ్రామాల్లో పనులు లేకపోవడంతో రోజూ వందలాది మంది గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు ఉపాధి కోసం వెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, పిల్లలతో సహా గ్రామాలను విడిచి వెళ్లాల్సి వస్తుండటంతో పల్లెల్లో జనసంచారం తగ్గుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ ఉపాధి కోసం వలస వెళ్లే పరిస్థితి నెలకొనడం గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థిక ఇబ్బందులకు అద్దం పడుతోంది.
ప్రభుత్వం స్పందించాలంటున్న అన్నదాతలు
కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత ఉన్న మండలాలను కరువు జాబితాలో చేర్చాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టపరిహారం, పంటల బీమా, వ్యవసాయ కూలీలకు ఉపాధి, వలసలను నివారించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల హడావుడి మధ్య గ్రామీణ ప్రజల జీవన సమస్యలు మరుగున పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
రాజ శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా