జిల్లేడు ద్రావణంతో పంటలకు సహజ రక్షణ
బాడంగి, అక్టోబరు 26 (మేజర్ న్యూస్): స్థానికంగా లభించే సహజ వనరులతో పంటలకు అవసరమైన ద్రావణాలను రైతులు స్వయంగా తయారు చేసుకోవాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సూచించారు. సోమవారం గజరాయనివలస గ్రామంలో ప్రకృతి వ్యవసాయ ఎఫ్‌ఎంటీ వై. ఈశ్వరరావు ఆధ్వర్యంలో రైతులతో జిల్లేడు ద్రావణాన్ని తయారు చేయించారు. వంద లీటర్ల నీటికి పది లీటర్ల ఆవు మూత్రం, పది కిలోల జిల్లేడు ఆకులు కలిపి మూడు రోజులపాటు నానబెట్టి, వడకట్టిన అనంతరం పిచికారీకి వినియోగించాలని వివరించారు. ఈ ద్రావణం పంటలకు సహజ రక్షణ కల్పించి, చీడపీడల ప్రభావాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో రైతులు, ఐసీఆర్‌పీ హైమా పాల్గొన్నారు.