శిల్పా హిల్స్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి డిప్యూటీ కమిషనర్‌కు వినతి
మాదాపూర్,మేజర్ న్యూస్ : మాదాపూర్ ఇజ్జత్‌నగర్ పరిధిలోని శిల్పా హిల్స్, హైటెక్స్ ప్రాంతాల మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, బిజెపి నాయకులు గంగల రాధాకృష్ణ యాదవ్ శిల్పా హిల్స్ నివాసితులతో కలిసి మాధాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణను ప్రజావాణిలో కలిసి వినతిపత్రం సమర్పించారు.మొండి కుంట చెరువు నుంచి ఇజ్జత్‌నగర్ బస్తీ వరకు రోడ్డు నంబర్ 2 మీదుగా ప్రవహిస్తున్న నాలాను ఏళ్ల తరబడి శుభ్రం చేయకపోవడంతో రోడ్డు నంబర్లు 2, 3, 4 ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపిస్తోందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. పగిలిపోయిన నాలా స్లాబులను మార్చడంతో పాటు డ్రైనేజీ లీకేజీల నివారణ, రహదారుల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, చెత్త తొలగింపు చేపట్టాలని కోరారు.వినతిపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు అధికారులతో నిరంతరం సంప్రదిస్తామని గంగల రాధాకృష్ణ యాదవ్ పేర్కొన్నారు. సమస్యలపై స్పందించిన డిప్యూటీ కమిషనర్‌కు నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, మురళి, శేషసాయి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.