ఒకే గ్రామంలో రెండు బొడ్రాయిలా?... గ్రామ ప్రజల్లో ఆందోళన
సూర్య వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో భూలక్ష్మి, మా లక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం రాజకీయ వర్గాల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఒకే గ్రామంలో రెండు బొడ్రాయిల ప్రతిష్ఠాపన జరగడం మంచిది కాదని భావిస్తున్న గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో అధికార పార్టీకి చెందిన నాయకులు ఒకవైపు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు మరోవైపు బొడ్రాయి ప్రతిష్ఠాపనకు సంబంధించి ఇటీవల భూమిపూజ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిసింది. ఈ పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు ఇరువర్గాల నాయకులను పిలిపించి పంచాయతీ ఏర్పాటు చేశారు.గ్రామంలో ఐకమత్యం దెబ్బతినకుండా, అందరూ కలిసికట్టుగా ఉండేలా ఒకే నిర్ణయానికి రావాలని ప్రజలు నాయకులకు సూచించినట్లు సమాచారం. అయితే ఇరువర్గాల మధ్య చర్చలు జరిగినప్పటికీ ఇప్పటివరకు తుది నిర్ణయం వెలువడలేదు.గ్రామ సంప్రదాయాలు, ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నాయకులు పరస్పర అంగీకారంతో ముందుకు రావాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇరువర్గాల చర్చలు ఎలాంటి నిర్ణయానికి దారితీస్తాయి? రెండు బొడ్రాయిల ప్రతిష్ఠాపన కొనసాగుతుందా? లేక గ్రామస్తుల అభిప్రాయం మేరకు ఒకే నిర్ణయం తీసుకుంటారా? అనేది గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.