మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి!
• నషాముక్తి భారత్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య
• నవంబర్ 14 వరకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
మంచిర్యాల, అక్టోబర్ 28 : మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత, విద్యార్థులకు అవగాహన కల్పించి, వ్యసనాలకు దూరంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నషాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు జిల్లా కలెక్టర్ చంద్రయ్య ఐఏఎస్ తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గౌరవ గవర్నర్ సూచనల మేరకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ధూమపానం, మద్యపానం, గుట్కా, పొగాకు, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినడంతో పాటు దూకుడు ప్రవర్తన, నిరాశ, నిద్రమత్తు, విద్యకు దూరం కావడం వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. వీటి ప్రభావం ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితం, చదువుపై పడుతుందని వివరించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కళాశాలల్లో అధ్యాపకులు ప్రతిరోజూ విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పరిసరాల్లో జరిగే పరిణామాలను గమనిస్తూ, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా అందిస్తున్న సేవలపై అదనపు కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్‌కుమార్, డాక్టర్ సునీల్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి అంజయ్య, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, జిల్లా వైద్య బృందం సభ్యులు అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, పుట్ట సత్తయ్య, లక్ష్మణస్వామి, సురేందర్, దిశా కార్యకర్తలు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.