పత్తి దిగుబడి భారీగా తగ్గింది.. ఝరాసంగం మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి.
ఝరాసంగం ః వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో వ్యవసాయ దిగుబడులు తగ్గి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్ యువ నాయకుడు శివపాదం ఆవేదన వ్యక్తం చేశారు. ఝరాసంగం మండలంలో రైతుల పరిస్థితిని ప్రభుత్వం తక్షణమే పరిశీలించి, మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.గతంలో ఎకరాకు 12 నుంచి 18 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చేదని, ఈసారి అనేక ప్రాంతాల్లో ఎకరాకు కేవలం 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడే వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారని శివపాదం పేర్కొన్నారు. దిగుబడి గణనీయంగా తగ్గడంతో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, ఇతర పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని అన్నారు.
పెట్టుబడి ఎలా తిరిగి వస్తుంది.. రైతు కుటుంబం ఎలా బతకాలి?
ఒక ఎకరం పత్తి సాగు కోసం రైతు నెలల తరబడి శ్రమించి, అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నాడు. పంట చేతికి వచ్చే సమయానికి దిగుబడి గణనీయంగా తగ్గిపోతే చేసిన అప్పులు ఎలా తీర్చాలి? కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, తదుపరి పంట సాగుకు అవసరమైన పెట్టుబడులను ఎలా సమకూర్చుకోవాలి? అనే ప్రశ్నలు రైతులను వేధిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పంట సాగులో రైతు పడుతున్న కష్టం, పెట్టిన పెట్టుబడి, ఆశించిన దిగుబడి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడితే రైతు కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల వంటి విషాదకర పరిస్థితులకు చేరకుండా ప్రభుత్వం ముందుగానే స్పందించి అండగా నిలవాలి అని కోరారు.
రైతు కి రూ.20 వేల పరిహారం ప్రకటించాలి
ఝరాసంగం మండలంలోని పత్తి పంటల పరిస్థితిని వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవ దిగుబడులు, పంట నష్టాన్ని అంచనా వేయాలని శివపాదం డిమాండ్ చేశారు. మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు, అర్హులైన నష్టపోయిన రైతులకు రూ.20 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు.రైతులకు పంట నష్టపరిహారంతో పాటు పంటల బీమా, బ్యాంకు రుణాల విషయంలో వర్తించే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపశమనం, తదుపరి పంట సాగుకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. రైతుల వాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా కాలయాపన చేస్తే వ్యవసాయ కుటుంబాలు మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందన్నారు.
రైతు కన్నీటిని తుడవాలి.. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతులకు పంట దిగుబడి తగ్గడం కేవలం ఆదాయ నష్టం మాత్రమే కాదని, అది వారి కుటుంబాల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని శివపాదం పేర్కొన్నారు. రైతుల కష్టాలను గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలని కోరారు.