మునుగోడు కరవుకు పాలకుల నిర్లక్ష్ట్యమే కారణం
మునుగోడు,మేజర్ న్యూస్:తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రకటించిన 365 కరువు మండలాల జాబితాలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన మునుగోడు, చండూరు, గట్టుప్పల్, మర్రిగూడ, నాంపల్లి, నారాయణపురం, చౌటుప్పల్ మండలాలు ఉండటం తీవ్ర బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.బుదవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో సరైన సాగునీటి సదుపాయాలు లేకపోవడంతో రైతులు ప్రధానంగా వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. సకాలంలో వర్షాలు కురవకపోవడం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో పాటు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ కాలువ పనులను కూడా పూర్తిచేసి మునుగోడు నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
మునుగోడు ప్రాంతంలో కరువు పరిస్థితులకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని, రైతులను ఆదుకుని వ్యవసాయ రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
కె.ఇంద్రసేనా రెడ్డి, మేజర్ న్యూస్, మునుగోడు, నల్గొండ జిల్లా.