ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి : కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ , 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా .. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం: బీఆర్‌ఎస్ నేత
సూర్య ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వం 96 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న నేపథ్యంలో తక్షణమే ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సాగునీరు, విద్యుత్, రైతుల సమస్యలపై దృష్టి పెట్టకుండా బీఆర్‌ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడానికే కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,055 రోజులైనా చెప్పుకోవడానికి ఒక్క మంచి పని లేదని విమర్శించారు. కేటీఆర్ హెయిర్‌స్టైల్, వ్యక్తిగత అంశాలపై విమర్శలు చేయడం వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ నియామకాల విషయంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలను నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు.
సాగునీటి ప్రాజెక్టులు, నీటి పంపకాలపై కాంగ్రెస్ నేతలకు సరైన అవగాహన లేదని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, నీళ్లు, కరెంట్ వంటి ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ హితవు పలికారు. బీఆర్‌ఎస్‌పై ఎన్ని విమర్శలు చేసినా ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలు గోసుల శ్రీనివాస్ యాదవ్, అభిలాష్ రంగినేని, గౌతమ్ ప్రసాద్ పాల్గొన్నారు