అంకిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
బొంరాస్ పేట్, మేజర్ న్యూస్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అంకిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో బురహన్పూర్, వడిచర్ల ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం విద్యార్థులకు బ్యాగులు, మ్యాట్లు, చెప్పులు పంపిణీ చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కన్వీనర్ గౌరారం గోపాల్ మాట్లాడుతూ.. అంకిత ఫౌండేషన్ గత ఐదేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉందని, వారికి తగిన ప్రోత్సాహం, అవసరమైన సదుపాయాలు కల్పిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌ఎన్ జిల్లా కోఆర్డినేటర్ ప్రత్యూష, అంకిత ఫౌండేషన్ ఫీల్డ్ ఆఫీసర్లు విజయలక్ష్మి, శరత్‌రెడ్డి, సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేరాజ్, నరేందర్ గౌడ్, యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎం.డి. అలీముద్దీన్, ఆర్పీ నవీన్, విజయలక్ష్మి, నరసింహులు, రవి, విద్యావతి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: శ్రీశైలం, బొంరాస్ పేట్, వికారాబాద్ జిల్లా.