ఫ్లైఓవర్ పనుల వేగం: ట్రిపుల్ ఐటీ జంక్షన్ పరిధిలో ట్రాఫిక్ డైవర్షన్లు
రాడిసన్ హోటల్ నుంచి ట్రిపుల్ ఐటీకి, ట్రిపుల్ ఐటీ నుంచి రాడిసన్ హోటల్‌కు ఇలా చేరుకోండి
హైదరాబాద్ సిటీబ్యూరో, మేజర్ న్యూస్(అక్టోబర్ 26): ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద జరుగుతున్న మల్టీ-లెవల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా, ఈ అభివృద్ధి పనులను సులభతరం చేసేందుకు గతంలో జూలై 01.2026 నుంచి 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు/మార్పులను విధిస్తూ ఒక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆ నిర్మాణ పనులను వేగవంతం చేసే ఉద్దేశంతో, డీఎల్ ఎఫ్ గేట్ నం. 1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రహదారి మార్గాన్ని, 27.10.2026 నుంచి మరో మూడు (3) నెలల పాటు మూసి ఉంచాలని ప్రతిపాదించినట్టు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఒక ప్రకటనలో సోమవారం పేర్కొన్నారు. అయితే, నిర్మాణ పనుల పురోగతిని అందుబాటులో ఉన్న రహదారి స్థలాన్ని బట్టి, ఈ మార్గంలో ట్రాఫిక్‌ను దశలవారీగా పాక్షికంగా అనుమతించనున్నట్టు ప్రత్యేకంగా తెలిపారు. అయితే, రాడిసన్ హోటల్ నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను డీఎల్ఎఫ్ గేట్ నం.1 వరకు అనుమతిస్తారని, ఇంకా డీఎల్ఎఫ్ గేట్ నం.1 దాటిన తర్వాత నిలిపివేస్తారని పేర్కొన్నారు. వారు గచ్చిబౌలి జంక్షన్-కుడి మలుపు తీసుకుని ఇందిరానగర్- ఐఐఐటీ జంక్షన్ మీదుగా వెళ్లాలన్నారు. నాన్-ఎస్ఈజెడ్ (సీఎంసీ) గేట్ ద్వారా పనిచేస్తున్న టీసీఎస్ కంపెనీ ఉద్యోగులను వారి సాధారణ నాన్-ఎస్ఈజెడ్ గేట్ ద్వారా ప్రవేశించడానికి , ఇంకా నిష్క్రమించడానికి అనుమతిస్తారని ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. కాగా, లింగంపల్లి వైపు నుంచి డీఎల్ ఎఫ్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్‌ను గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద మళ్లిస్తారు. ఈ వాహనాలు ట్రిపుల్ ఐటీ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ మీదుగా వెళ్లి, ఎడమవైపు తిరిగి, రాడిసన్ జంక్షన్ వద్ద మళ్లీ ఎడమవైపు తిరగడం ద్వారా డీఎల్ ఎఫ్ కు చేరుకోవాలని పేర్కొన్నారు.
ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కనీసం ఒక సంవత్సరం పాటు కొనసాగే అవకాశం ఉన్నందున, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఇంకా దాని పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడవచ్చు. ఐటీ ఉద్యోగులతో సహా నిత్యం ప్రయాణించే వారు సురక్షితమైన ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ అధికారులు కోరారు. 27.10.2026 నుంచి 90 రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుందని, కావున, ప్రజలంతా దీనిని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, ట్రాఫిక్ సజావుగా సాగేలా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కోరారు.