కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది – తన్నీరు నాగేశ్వరరావు
వత్సవాయి: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పోలీసుల వ్యవహారశైలిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ఓటమి భయంతోనే కూటమి ప్రభుత్వం అక్రమ నిబంధనలను అమలు చేస్తూ వైసీపీ నాయకులను ఎన్నికల విధులకు దూరం చేస్తోందని ఆరోపించారు.
గురువారం ఉదయం 7 గంటల నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చీఫ్ ఏజెంట్లు, బూత్ ఏజెంట్లను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్కడే కూర్చోబెట్టారని, దీంతో వారు పోలింగ్ కేంద్రాల వద్ద తమ విధులు నిర్వహించలేకపోయారని తన్నీరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎటువంటి కేసులు లేని వైసీపీ నాయకులను మాత్రమే పోలీస్ స్టేషన్‌కు తరలించడం, తెలుగుదేశం పార్టీ నాయకుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పక్షపాత ధోరణికి నిదర్శనమని విమర్శించారు.
సుమారు ఐదు గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులను పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, పోలీసుల చర్యలను పరిశీలించి నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ సాగేలా చర్యలు తీసుకోవాలని తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.