వేసవిలో నిర్మల్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు :
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి :
ఎస్సార్‌ఎస్పీ ప్రాజెక్టును సందర్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి
ఎల్‌నినో ప్రభావంతో రానున్న వేసవిలో నిర్మల్ పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు. పట్టణానికి తాగునీరు అందించే ఎస్సార్‌ఎస్పీ ప్రాజెక్టును ఆయన అధికారులతో కలిసి సందర్శించి, ప్రస్తుత నీటి నిల్వలు, వేసవిలో నీటి సరఫరా పరిస్థితిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుత నీటి మట్టాన్ని పరిశీలిస్తే పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలిగే అవకాశాలు లేవని, వేసవి అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉందని తెలిపారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో నీటి నిల్వలు తగ్గినప్పటికీ, ఆ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించినట్లు పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా తాగునీటి పైపులైన్లలో లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా నీటి లీకేజీలు గుర్తించినట్లయితే వెంటనే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
వేసవిలో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీటి వృథాను అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని అప్పాల గణేష్ చక్రవర్తి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంల కౌన్సిలర్లు గోపు గోపి, పెండం శ్రీనివాస్,నాందేడపు చిన్ను,రఫీ, చెనిగరపు నరేష్, జకి, శ్రీకాంత్ యాదవ్, డిఈ హరిభువన్ పాల్గొన్నారు.