వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు కష్టాలు! కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం.. అధికారుల మధ్య సమన్వయ లోపం
కొండాపూర్ ; మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలోని ఐదు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క వరి గింజ కొనుగోలు చేయలేదు. ఇప్పటికే కేంద్రాల్లో సుమారు 15 వేల బస్తాల ధాన్యం తూకం వేసి నిల్వ చేయగా, సహకార సంఘాల పరిధిలో సుమారు 6 వేల క్వింటాళ్ల ధాన్యం పేరుకుపోయింది. రవాణా ఏర్పాట్లు లేకపోవడంతో ధాన్యం గోదాములకు తరలింపు జరగడం లేదు.రవాణా నిర్వాహకులను సంప్రదిస్తే డీఎం కార్యాలయానికి, అక్కడి నుంచి డీఎస్‌ఓ కార్యాలయానికి సంప్రదించాలని చెబుతూ అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యతలు నెట్టుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజురోజుకూ ధాన్యం నిల్వలు పెరుగుతుండటంతో వాతావరణ మార్పులు, తేమ శాతం తగ్గడం, బరువు తరుగు, నాణ్యత దెబ్బతినడం వంటి సమస్యలతో రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పెట్టుబడి పెట్టి పండించిన పంటను విక్రయించుకోలేక రైతులు ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ధాన్యం రవాణా, కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో రైతులంతా ఏకతాటిపైకి వచ్చి ధర్నాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.