సూర్య, వేములవాడ: వేములవాడ పట్టణ పరిధిలోని తిప్పాపూర్‌లో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఎన్ పి డీ సీ ఎల్) పరిపాలనా, సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. ఇందుకోసం రూ.2 కోట్ల 70 లక్షల 64 వేల అంచనా వ్యయంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. వేములవాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న విద్యుత్ వినియోగం, దీర్ఘకాలిక ఫీడర్ల కారణంగా ఎదురవుతున్న అంతరాయాలను తగ్గించేందుకు ఈ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రతిపాదించారు. నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు గృహ, వ్యవసాయ అవసరాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందే అవకాశం ఉంది. సబ్‌స్టేషన్ మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు తిప్పాపూర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.