పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
హైదరాబాద్ :పానగల్‌లోని చారిత్రక ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేయడం పట్ల రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంతి, నీడ, నిర్మాణ శాస్త్రాలను సమన్వయం చేస్తూ శివలింగంపై నిరంతరం ఛాయ పడేలా నిర్మించిన ఈ ఆలయం తెలంగాణ శిల్పకళా వైభవానికి, ప్రాచీన విజ్ఞానానికి అద్భుత నిదర్శనమని మంత్రి కొనియాడారు. రేవంత్ రెడ్డి సహకారంతో ఈ చారిత్రక ఆలయానికి యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని, దీనిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మంత్రి చొరవతో ఆలయాభివృద్ధికి రూ.20 కోట్లు విడుదల కావడం పట్ల భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు.