బీసీ హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి
హైదరాబాద్ :బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను వేలం వేసి అమ్మే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఆ స్థలాలను అదనంగా 100 బీసీ కాలేజీ హాస్టళ్లు, 100 బీసీ గురుకుల పాఠశాలల నిర్మాణానికి ఉపయోగించాలని కోరారు. రాష్ట్రంలో 325 కాలేజీ హాస్టళ్లు, 320 బీసీ గురుకులాలు అద్దె భవనాల్లో చాలీచాలని వసతులతో నడుస్తున్నాయని, దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యం, చదువు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో సీట్లు దొరక్క విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం భూముల అమ్మకాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తామని, పార్లమెంటులో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతామని హెచ్చరించారు.