బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.
రామాయంపేట ; బీసీ-ఏ జాబితాలో ముదిరాజ్ కులస్తులను చేర్చే ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. పరిమితంగా ఉన్న రిజర్వేషన్లలో కొత్త కులాల చేరికతో ఇప్పటికే జాబితాలో ఉన్న వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం నిజాంపేట మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగు స్వామి మాట్లాడుతూ.. బీసీ-ఏ జాబితాలో ఉన్న 57 కులాల్లో అధిక శాతం చేతివృత్తులపై ఆధారపడి జీవించే వర్గాలేనని పేర్కొన్నారు. ఆయా కులాలు ఇప్పటికే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని, తమ పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించుకునేందుకు రిజర్వేషన్లు కీలకంగా ఉన్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో బీసీ-ఏ జాబితాలో కొత్త కులాలను చేర్చే విషయంలో ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఒక వర్గానికి ప్రయోజనం కల్పించే క్రమంలో ఇప్పటికే జాబితాలో ఉన్న ఇతర వెనుకబడిన కులాల ప్రయోజనాలు దెబ్బతినకూడదన్నారు. చేతివృత్తుల కులాల హక్కులను పరిరక్షించేలా ప్రభుత్వం పునరాలోచించాలని, ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే ప్రకటనను ఉపసంహరించుకోవాలని సంగు స్వామి డిమాండ్ చేశారు.