చారిత్రక కట్టడాల పరిరక్షణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి చార్మినార్ పరిసరాల్లో క్యూ క్యు ఎస్ యు డి ఎ అడ్మినిస్ట్రేటర్ పి. గౌతమి ఐఏఎస్ తనిఖీ
హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చేపడుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటర్ శ్రీమతి పి. గౌతమి ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్యూ క్యు ఎస్ యు డి ఎ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సర్దార్ మహల్ పరిరక్షణ పనుల పరిశీలన :
ఈ పర్యటనలో భాగంగా సర్దార్ మహల్‌లో చేపడుతున్న పరిరక్షణ పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ కట్టడాల వారసత్వ విలువలను కాపాడుతూ, పరిరక్షణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
ముర్గీ చౌక్, మచిలీ కమాన్ అభివృద్ధిపై సమీక్ష :
అనంతరం ముర్గీ చౌక్, మచిలీ కమాన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆమె తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న పనుల ప్రస్తుత స్థితిగతులను, ప్రతిపాదిత అభివృద్ధి చర్యల అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతాలను పరిరక్షించడంతో పాటు ప్రజలకు, సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి :
అభివృద్ధి పనుల అమలులో సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమని పి. గౌతమి పేర్కొన్నారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజల సౌకర్యాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులను వీలైనంత త్వరగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
హైదరాబాద్ చారిత్రక వారసత్వానికి ప్రతీకలుగా నిలిచే కట్టడాలు, పరిసర ప్రాంతాల పరిరక్షణతో పాటు అభివృద్ధి పనులు సమర్థవంతంగా పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె స్పష్టం చేశారు.