సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ:
సూర్య ఇంటర్నేషనల్ డెస్క్, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, విమానాల ఆకస్మిక రద్దు కారణంగా సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, ముఖ్యంగా వేలాది మంది ఉమ్రా యాత్రికులకు బాసటగా నిలిచేందుకు భారత ప్రభుత్వం అత్యవసర చర్యలను ముమ్మరం చేసింది. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెద్దాలోని కాన్సులేట్ జనరల్ సంయుక్తంగా 24 గంటల కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి యాత్రికులకు అవసరమైన నివాస, భోజన, ఔషధ సదుపాయాలను సమకూరుస్తున్నాయి. యాత్రికులను సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు ఎయిర్‌లైన్స్, స్థానిక ట్రావెల్ ఆపరేటర్లు, సౌదీ హజ్ & ఉమ్రా మంత్రిత్వ శాఖతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.
ఆహారం, మందులు, వీసా సమస్యల పరిష్కారానికి చర్యలు:
మక్కా, మదీనా, జెద్దాలలో చిక్కుకుపోయిన సుమారు 4,000 మందికి పైగా యాత్రికులకు స్థానిక వాలంటీర్ల సహాయంతో నిత్యావసరాలు, అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విమానాలు రద్దయిన కారణంగా నివాస గడువు ముగిసిన లేదా వీసా వ్యాలిడిటీ సమస్యలు ఎదుర్కొంటున్న వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు సౌదీ అధికారులతో భారత దౌత్య కార్యాలయం చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు వేలాది మందిని స్వదేశానికి తరలించగా, మిగిలిన వారిని కూడా దశలవారీగా భారతదేశానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
24X7 అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు:
సౌదీ అరేబియాలో ఉన్న భారతీయ పౌరుల సహాయార్థం భారత విదేశాంగ శాఖ కింది కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులో ఉంచింది:
భారత ఎంబసీ (రియాద్): ఫోన్ నంబర్లు: +966-554412016, +966-542126784 | టోల్-ఫ్రీ (సౌదీలో మాత్రమే): 8002471234 | వాట్సాప్: +966-536216082
కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (జెద్దా): ఫోన్ నంబర్లు: +966-12-2614093, +966-556122301 | వాట్సాప్: +966-536209704
* సౌదీ హజ్ & ఉమ్రా మంత్రిత్వ శాఖ పిలిగ్రిమ్ కేర్ సెంటర్ నంబర్ 1966ను కూడా సంప్రదించి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని భారత మిషన్ సూచించింది.