ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు..
సూర్య సిటీ & హెల్త్ బ్యూరో, ముంబై: ముంబై నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లు, ఫుడ్ ఔట్‌లెట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై మహారాష్ట్ర ఆహార మరియు ఔషధ పరిపాలన విభాగం (FDA) కొరడా ఝళిపించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముంధే ఆదేశాల మేరకు చేపట్టిన విస్తృత తనిఖీల్లో తీవ్ర అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూడటంతో ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా మొత్తం ఏడు ఆహార కేంద్రాల లైసెన్సులను అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు.
ప్రముఖ హోటళ్లలో తీవ్ర ఉల్లంఘనలు:
అంధేరి వెస్ట్‌లోని ప్రసిద్ధ 'ఒట్టోమన్ కేఫ్' మరియు 'భారత్ క్యాంటీన్', జోగేశ్వరిలోని 'చాచా ఈగిల్ కుల్ఫీ ఫలూదా', లోయర్ పరేల్‌లోని 'ముంబై దర్బార్ ఫ్యామిలీ రెస్టారెంట్' వంటి ప్రముఖ ఔట్‌లెట్లపై ఎఫ్‌డీఏ చర్యలు తీసుకుంది. తనిఖీల్లో వెల్లడైన ప్రధాన లోపాలు:
కిచెన్లు అత్యంత అపరిశుభ్రంగా ఉండటం, పురుగులు మరియు బొద్దింకల సంచారం గుర్తించడం.
శాకాహార (Veg), మాంసాహార (Non-Veg) పదార్థాలను నిబంధనలకు విరుద్ధంగా ఒకే ఫ్రిజ్‌లో కలిపి నిల్వ చేయడం.
ఆహార తయారీలో అనుమతి లేని కృత్రిమ రంగులు, హానికర రసాయనాలను వాడటం.
హోటల్ సిబ్బందికి చట్టబద్ధమైన వైద్య ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం.
రాష్ట్రవ్యాప్త దాడులు – కల్తీ పాలు, నిల్వలు స్వాధీనం:
రెస్టారెంట్లతో పాటు పాల డెయిరీలు, మసాలా మిల్లులపై కూడా ఎఫ్‌డీఏ బృందాలు మెరుపు దాడులు చేశాయి. ముంబైలోని గోవండి, మన్‌ఖుర్ద్, ధారావి, మాహిమ్ ప్రాంతాల్లో కల్తీ అనుమానంతో 564 లీటర్ల నాసిరకం పాలను అక్కడికక్కడే పారబోసి ధ్వంసం చేశారు. ముంబైలో రూ.4.22 లక్షలు, పుణేలో రూ.19.56 లక్షల విలువైన నిషిద్ధ ఆహార నిల్వలను సీజ్ చేశారు. నవీ ముంబై ఎండీఐసీలోని మసాలా తయారీ కేంద్రాలపై దాడులు చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించని సరుకును జప్తు చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఏ సంస్థనూ ఉపేక్షించేది లేదని కమిషనర్ తుకారాం ముంధే హెచ్చరించారు.