ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు : నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా
ప్రతి నీటి బొట్టును సంరక్షించడమే లక్ష్యం: జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి
హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):నగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తోంది. ముఖ్యంగా ట్యాంకర్ల ద్వారా నీటి రవాణా సమయంలో జరుగుతున్న వృథాను నివారించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అక్టోబర్ 24న సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జలమండలి పరిధిలోని కొన్ని నీటి ట్యాంకర్లలో సామర్థ్యానికి మించి నీటిని నింపడం, మరికొన్ని ట్యాంకర్లకు మూతలు లేకపోవడం లేదా వాటిని సరిగా మూసివేయకపోవడం వల్ల రవాణా సమయంలో నీరు రహదారులపై వృథాగా పోతున్నట్లు జలమండలి గుర్తించింది. దీనివల్ల విలువైన తాగునీరు వృథా కావడంతో పాటు రహదారులపై వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ట్యాంకర్లలో నీటి నింపుదల, రవాణా సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను అమలు చేయాలని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల జనరల్ మేనేజర్లను ఆదేశించింది.
*నవంబర్ 1 నుంచి జరిమానాలు:*
ట్యాంకర్ల ద్వారా నీటి వృథాకు పాల్పడినట్లు గుర్తిస్తే 2026 నవంబర్ 1 నుంచి సంబంధిత ట్యాంకర్ యజమానికి రూ.5 వేల జరిమానా విధించనున్నారు. అదే ట్యాంకర్ రెండోసారి నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనున్నారు.
నీటి లీకేజీలు ఉన్న ట్యాంకర్లను, మూతలు లేని లేదా సరిగా మూసివేయని ట్యాంకర్లను ఫిల్లింగ్ స్టేషన్లలో నీటి నింపుదలకు అనుమతించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నీరు వృథా కాకుండా ట్యాంకర్ యజమానులు, డ్రైవర్లు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఫిల్లింగ్ స్టేషన్లలో పర్యవేక్షణ:
జలమండలి పరిధిలోని అన్ని ఫిల్లింగ్ స్టేషన్ల మేనేజర్లు, ఇన్‌చార్జ్‌లు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ట్యాంకర్లలో నీటిని నింపే ముందు లీకేజీలు, మూతల పరిస్థితిని పరిశీలించాలని, లోపాలు గుర్తించినట్లయితే వాటిని సరిచేసే వరకు నీటి నింపుదలకు అనుమతించరాదని స్పష్టం చేశారు.
ఈ ఆదేశాల అమలును సంబంధిత డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు పర్యవేక్షించాలని సూచించారు. ట్యాంకర్ అసోసియేషన్లు సైతం తమ సభ్యులకు నిబంధనలపై అవగాహన కల్పించి, నీటి వృథా నివారణకు సహకరించాలని కోరారు.
నీటి సంరక్షణలో అందరి భాగస్వామ్యం అవసరం:
ప్రస్తుత నీటి వనరుల పరిస్థితుల దృష్ట్యా ప్రతి నీటి బొట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జలమండలి స్పష్టం చేసింది. ప్రజలకు సరఫరా చేసే తాగునీరు రవాణా సమయంలో వృథా కాకుండా చూడటం ట్యాంకర్ యజమానులు, డ్రైవర్ల బాధ్యత అని పేర్కొంది.
నీటి పొదుపు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని, జారీ చేసిన మార్గదర్శకాలను సంబంధిత అధికారులు, ట్యాంకర్ నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని జలమండలి సూచించింది.