జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్–ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వరకు సిగ్నల్ రహిత ట్రాఫిక్
4.3 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ పనుల వేగవంతానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలు
హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, వాహనదారులకు సాఫీ ప్రయాణాన్ని అందించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వరకు ప్రతిపాదించిన 4.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనుల పురోగతిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్.వి. కర్ణన్ సీనియర్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ కారిడార్ ద్వారా ఈ మార్గంలో సిగ్నల్ రహిత ట్రాఫిక్‌ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, ప్రధాన జంక్షన్ల వద్ద రద్దీని తగ్గించి ప్రయాణ సమయాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ పనుల పురోగతిని పరిశీలించిన కమిషనర్, జంక్షన్ల అభివృద్ధి, యుటిలిటీల తరలింపు, జియోటెక్నికల్ పరిశోధనలు, ఫౌండేషన్ పనులు, స్టీల్ ఫ్యాబ్రికేషన్ వంటి అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పనులన్నింటినీ సమన్వయంతో వేగవంతం చేసి, ప్రాజెక్టు అమలులో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు.
జంక్షన్ల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి :
కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వన్‌వే ట్రాఫిక్ వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. కేబీఆర్ పార్క్ ప్రధాన ప్రవేశ ద్వారం, అగర్సేన్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద చేపట్టాల్సిన జంక్షన్ అప్‌గ్రేడేషన్ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిర్వహణకు ఇబ్బందులు తలెత్తకుండా, వాహనాల రాకపోకలు సులభంగా సాగేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని సూచించారు.
యుటిలిటీల తరలింపునకు సమన్వయం :
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా వివిధ యుటిలిటీల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ తెలిపారు. ఇందుకోసం తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) అధికారులతో తక్షణమే సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఫౌండేషన్ డిజైన్ పరిశోధనలకు ప్రాధాన్యం :
ముగ్ధ జంక్షన్ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వరకు ఉన్న మార్గంలో జియోటెక్నికల్ పరిశోధనలు, ఫౌండేషన్ డిజైన్‌కు సంబంధించిన అధ్యయనాలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనులకు అవసరమైన సాంకేతిక పరిశోధనలను సకాలంలో పూర్తి చేయడం ద్వారా తదుపరి దశ పనులను ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
తవ్వకాలు, స్టీల్ ఫ్యాబ్రికేషన్ పనులు ముమ్మరం :
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ముగ్ధ జంక్షన్ వరకు ఫౌండేషన్ తవ్వకాలను వేగవంతం చేయడంతోపాటు, అవసరమైన స్టీల్ నిర్మాణాల ఆఫ్‌సైట్ ఫ్యాబ్రికేషన్ పనులను సమాంతరంగా చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయం పెంచి, నిర్మాణానికి సంబంధించిన అన్ని దశలను నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపే దిశగా ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కీలకంగా నిలవనుంది. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, నిర్మాణపరమైన పనులను వేగవంతం చేయడం ద్వారా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వరకు ట్రాఫిక్ సాఫీగా సాగేలా అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది.