ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ఘట్టం. చివరి రోజు 32 నామినేషన్ దాఖలు. 20 ఎంపీటీసీ స్థానాలకు 81 నామినేషన్లు.
అనపర్తి, మేజర్ న్యూస్. అనపర్తి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ప్రశాంతంగా ముగిసింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడంతో నామినేషన్ల ఘట్టం ప్రశాంతంగా ముగిసాయి. చివరి రోజు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికల సందడి నెలకొంది. మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 81 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. చివరి రోజైన శుక్రవారం 32 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.పార్టీల వారీగా తెలుగుదేశం పార్టీ తరఫున 27, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 40, బీజేపీ తరఫున 5, జనసేన తరఫున 3, స్వతంత్ర అభ్యర్థులుగా 6 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మండలంలో స్థానిక ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ తరఫున అనపర్తి-1 నుంచి మేడపాటి సత్యనారాయణరెడ్డి, అనపర్తి-2 నుంచి మామిడిశెట్టి శ్రీదేవి, అనపర్తి-5 నుంచి బోనగిరి దుర్గ, బోనగిరి సుబ్బలక్ష్మి, పొలమూరు-1 నుంచి గుడాల వీరవేణి, పొలమూరు-2 నుంచి గుత్తుల సత్యనారాయణ, కాదా రాము, అనపర్తి-6 నుంచి ద్వారంపూడి రజని, అనపర్తి-7 నుంచి మేడిశెట్టి అర్జునరావు, కుతుకులూరు-1 నుంచి పైడిమళ్ల వెంకటలక్ష్మి, కుతుకులూరు-2 నుంచి తాపేశ్వరపు లక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు.జనసేన పార్టీ తరఫున పులగుర్త నుంచి వెంకట మణికంఠ సతీష్, బీజేపీ తరఫున రామవరం-2 నుంచి తేనెల శివదుర్గ నామినేషన్లు సమర్పించారు.వైఎస్సార్సీపీ తరఫున అనపర్తి-7 నుంచి గుత్తుల సుబ్రహ్మణ్యం, పితాని మణికంఠస్వామి, అనపర్తి-4 నుంచి తేతలి సునీత, తేతలి కళావతి, దవులూరి వెంకట సూర్యకుమారి, అనపర్తి-5 నుంచి సామంతుల విజయలక్ష్మి, గుత్తుల సూర్యకుమారి, అనపర్తి-1 నుంచి గొలుగూరి సరోజిని, గొలుగూరి ధర్మారెడ్డి, రామవరం-1 నుంచి గుడిమెట్ల విజయలక్ష్మి, నల్లమిల్లి సంధ్య, అనపర్తి-6 నుంచి మల్లిడి సుజాత నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే మహేంద్రవాడ-2 నుంచి సబ్బెళ్ల జయలక్ష్మి, పొలమూరు-1 నుంచి సీరం ఉమామహేశ్వరి, పొలమూరు-2 నుంచి సీరం రాజు, అనపర్తి-2 నుంచి కానూరి నాగమణి, కొప్పవరం నుంచి మల్లిడి వీర రాఘవరెడ్డి, రామవరం-2 నుంచి మందపల్లి వీర వెంకట సత్యనారాయణ నామినేషన్లు సమర్పించారు. స్వతంత్ర అభ్యర్థిగా అనపర్తి-6 నుంచి పడాల మంగయ్యమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనపర్తి మండలంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎం. రామకృష్ణారెడ్డి, అనపర్తి అదనపు ఎస్సై దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. మరోవైపు అనపర్తి జెడ్పీటీసీ స్థానానికి పొలమూరు గ్రామానికి చెందిన చీకట్ల వెంకన్నబాబు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. రాజమండ్రిలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు.