ఫేక్ గ్లోబల్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం: కల్వకుంట్ల కవిత హెచ్చరిక
హైదరాబాద్ :ఫేక్ అగ్రిమెంట్లు, నకిలీ పెట్టుబడులతో నిర్వహిస్తున్న ఫేక్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుని తీరుతామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతేడాది తెచ్చామని చెప్పుకుంటున్న రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, లేదంటే డిసెంబర్‌లో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం మియాపూర్‌లో జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని పార్టీ ముఖ్య నాయకులు, కేడర్‌తో నిర్వహించిన 'రాజధాని రణభేరి' సమావేశంలో ఆమె పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రానున్న బల్దియా ఎన్నికల్లో గ్రేటర్‌లోని మూడు కార్పొరేషన్లలోనూ టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ 300 డివిజన్లలోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. నగరంలో కనీసం తాగునీరు ఇవ్వలేని వాళ్లు హైదరాబాద్‌ను న్యూయార్క్, లండన్ చేస్తామంటూ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని, సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక, దోమలు, కుక్కల బెడదతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఎలాంటి మానవత్వంతో కూడిన మార్పు రాలేదని, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. ఐటీ ఉద్యోగులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి ఎలాంటి పాలసీ లేదని, చెత్త సేకరించే 50 వేల మంది కార్మికులకు నష్టం కలిగిస్తూ రాంకీ సంస్థకు మేలు చేయాలని చూస్తే సీఎం ఇంటి ముందు చెత్త వేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఫాగింగ్, రోడ్ల నిర్మాణం, కుక్కల బెడద నివారణ, చెత్త నిర్వహణ ఇలా అన్ని విభాగాల్లోనూ అవినీతి జరుగుతోందని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను హెచ్చరిస్తూ అడవిలో తామే పులులమని అందరూ చెప్పుకుంటారు కానీ ఆ పులులను బంధించే వేటగాడు వచ్చాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రజలకు చేయాల్సింది చాలా ఉందని, కేడర్ ఎంతో క్రమశిక్షణతో పనిచేసి పార్టీ విధానాలను గల్లీ గల్లీకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక యువతకు రూ.2 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు రుణాలు అందిస్తామని, మహిళలు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. పాతబస్తీ నాయకులు ముఖ్యమంత్రికి గులామ్‌గా కాకుండా ప్రజలకు గులామ్‌గా ఉండాలని సూచిస్తూ, ముస్లింలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, ఇతర పార్టీల కంటే పదిరెట్లు ఎక్కువగా కష్టపడి పనిచేయాలని కేడర్‌ను కోరారు.