పూల అలంకరణతో శోభిల్లిన వాసవి మాత.. భక్తి పారవశ్యంలో.. అంబాజీపేట
మేజర్ న్యూస్, అంబాజీపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి శోభాయాత్ర అత్యంత భక్తిశ్రద్ధలతో, కన్నుల పండువగా సాగింది. స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ వార్షిక మహోత్సవంలో అమ్మవారిని రకరకాల సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. దివ్య మంగళ స్వరూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు.
అంబాజీపేట సెంటర్ మీదుగా సాగిన ఈ మహా ఊరేగింపులో కళాకారుల గరగ నృత్య ప్రదర్శనలు, సంప్రదాయ మంగళ వాయిద్యాలు, కోలాటాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు, యువకులు, ఆర్యవైశ్య ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి రథం వెంట నడిచారు. దారిపొడవునా భక్తులు నీరాజనాలు సమర్పించి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
భారీ సంఖ్యలో భక్తులు హాజరైన నేపథ్యంలో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా అంబాజీపేట సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) ఎస్.కె. సుభానీ పర్యవేక్షణలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవాలు విజయవంతంగా ముగియడంతో స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.