బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు రూ.40.68 కోట్ల బకాయిలు విడుదల
హైదరాబాద్ :రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తున్న ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ పథకానికి ప్రభుత్వం రూ.40.68 కోట్ల బకాయిలను విడుదల చేసింది. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల సహకారంతో ఈ పెండింగ్ నిధులను విడుదల చేయించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 225కుపైగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న దాదాపు 32 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం లేకుండా స్థిరత్వం చేకూరగా, పాఠశాలల యాజమాన్యాలకు భారీ ఊరట లభించింది. పేదరికం కారణంగా ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి నాణ్యమైన విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.