ఈనెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి
హైదరాబాద్ కోర్ అర్బన్ (క్యూర్) పరిధిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ టవర్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై గురువారం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, హౌసింగ్ కార్పొరేషన్ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఆన్‌లైన్ విధానంలో డ్రా (లాటరీ) తీయాలని సూచించారు. ప్రజల నమ్మకం కోసం ఈ లాటరీ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం (లైవ్) చేయడంతో పాటు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. క్యూర్ పరిధిలో మూడు విడతల్లో లక్ష ఇందిరమ్మ ఫ్లాట్లను నిర్మించనున్నట్లు వెల్లడించిన మంత్రి, మొదటి, రెండు మరియు మూడో విడతల టవర్ల నిర్మాణం కోసం పేదలు నివసించే ప్రాంతాలకు సమీపంలోనే యుద్ధప్రాతిపదికన స్థలాలు గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇళ్ల రిజిస్ట్రేషన్‌లో ప్రతి అపార్ట్‌మెంట్‌కు సంబంధించి భూమిలో వాటాను (UDS) సైతం పొందుపరుస్తామని తెలిపారు. వచ్చే ఏడాది బతుకమ్మ పండుగ నాటికి తొలి విడత ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, తొలి విడతలో ఇళ్లు రాని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, తదుపరి విడతల్లో కొత్త దరఖాస్తుదారులతో సహా అర్హులందరినీ పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేసి, కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, గృహనిర్మాణ ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.